Share News

సాయానికి వెళ్లి.. పేలుడుకు బలి

ABN , Publish Date - Apr 16 , 2026 | 05:04 AM

అద్దె ఇంట్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు నలుగురు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంట్లో మంటలు చెలరేగడాన్ని ముందే గుర్తించి అద్దెకున్నవారు పారిపోగా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఇరుగుపొరుగువారు మాత్రం ప్రాణాలు కోల్పోయారు

సాయానికి వెళ్లి.. పేలుడుకు బలి

  • అద్దె ఇంట్లో పేలిన జిలెటిన్‌ స్టిక్స్‌.. నలుగురు మృతి

  • 27 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం

  • పొగలు రాగానే పారిపోయిన కుటుంబం

  • మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఇరుగుపొరుగు

  • శ్రీసత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో దుర్ఘటన

పుట్టపర్తి/ కదిరి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): అద్దె ఇంట్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు నలుగురు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంట్లో మంటలు చెలరేగడాన్ని ముందే గుర్తించి అద్దెకున్నవారు పారిపోగా.. మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఇరుగుపొరుగువారు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో జిలెటిన్‌ స్టిక్స్‌, ఇతర పేలుడు పదార్థాలు పేలిన ఘటనలో గ్రామానికి చెందిన విశ్వనాథ రెడ్డి (52), మాబున్నీసా (51), మధుసూదన్‌ (35), అస్లాం (50) అనే నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో 27 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కుమ్మరవాండ్లపల్లిలో జయరాం నాయక్‌ అనే వ్యక్తి తన ఇంటిని 12 ఏళ్ల క్రితం తెలంగాణలోని నల్గొండ జిల్లా కొత్తగూడేనికి చెందిన వెంకన్నకు అద్దెకు ఇచ్చారు. వెంకన్న తన భార్య, కుమారుడు సంపత్‌, కోడలు, ఇద్దరు చిన్నారులతో కలిసి అప్పటి నుంచి ఈ ఇంట్లోనే నివసిస్తున్నాడు. వీరు స్థానికంగా ఉన్న క్వారీల్లో రాళ్లు పగులగొట్టే పనులకు వెళ్తుంటారు. ఆ పనులకు వినియోగించే జిలెటిన్‌ స్టిక్స్‌, ఇతర పేలుడు పదార్థాలు, పనిముట్లను ఇంట్లోనే నిల్వ ఉంచుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆ ఇంటి నుంచి దట్టమైన పొగ, మంటలు వచ్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన వెంకన్న కుటుంబ సభ్యులంతా వెంటనే బయటకు వచ్చి దూరంగా పారిపోయారు. అయితే.. ఇంట్లో పేలుడు పదార్థాలున్నాయన్న విషయం తెలియని ఇరుగు పొరుగువారు.. మంటలు ఆర్పేందుకు వెళ్లారు.


ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ఇల్లు కుప్పకూలిపోయింది. శిథిలాల కింద పలువురు ఇరుక్కుపోయారు. సమీపంలో ఉన్నవారికి ఇటుకలు, ఇనుప చువ్వలు, రవ్వలు దూసుకువచ్చి తగిలాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద స్థలాన్ని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎస్పీ సతీశ్‌ కుమార్‌, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ పరిశీలించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని కలెక్టర్‌, ఎస్పీ తెలిపారు.


విషయం చెప్పి ఉంటే ఘోరం జరిగేది కాదు..

పేలుడుకు ముందు ఆ ఇంటి నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అగ్ని ప్రమాదం జరిగిందని భావించిన చుట్టుపక్కలవారు సాయం చేసేందుకు వెళ్లారు. నీటితో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా జెలిటన్‌ స్టిక్స్‌ పేలిపోయాయి. సాయం చేసే గుణమే ఆ నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. కాగా, ఇంట్లో మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తమైన వెంకన్న, అతని కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. ఆ సమయంలో ఇరుగుపొరుగురు వారిని అప్రమత్తం చేసి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడు పదార్థాలు నిల్వ ఉంచి, నలుగురి ప్రాణాలు పోయేందుకు కారణమైన వెంకన్నను కదిరి రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Apr 16 , 2026 | 05:05 AM