Share News

ఎన్నికలకు ముందే.. 36 ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:16 AM

గొడ్డలి పార్టీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు

ఎన్నికలకు ముందే.. 36 ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి

  • గొడ్డలి పార్టీ పాలనలో నీటి పథకాలు ధ్వంసం: నిమ్మల

  • వచ్చే మార్చినాటికి పోలవరం తొలిదశ పూర్తి

  • డయాఫ్రం వాల్‌ ఉందో లేదో తెలియకుండానే జగన్‌ ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు

  • వెలిగొండ పూర్తికాకముందే జాతికి అంకితం చేశారు

  • కృష్ణా జలాలను తిరుపతి వరకు తరలిస్తాం

  • గత రెండేళ్లలో సీమ ప్రాజెక్టుల ప్రగతిని వైసీపీ విశ్వేశ్వరరెడ్డి సజ్జల సమక్షంలోనే చెప్పారు

  • ఎల్‌నినో ప్రభావంతో వానల్లేవు.. వరదలూ లేవు

  • రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి

  • రెండేళ్ల పాలనపై జల వనరుల మంత్రి ప్రజెంటేషన్‌

అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రాజెక్టులన్నీ గాడినపడి.. సాకారమవుతున్నాయని తెలిపారు. రూ.35,588 కోట్లతో 36 ప్రాధాన్య ప్రాజెక్టులను వచ్చే ఎన్నికలకు ముందే పూర్తి చేస్తామని ప్రకటించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ప్రత్యేక సీఎస్‌ శశిభూషణ్‌ కుమార్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో తమ శాఖ పనితీరుపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులంటే టీడీపీ ప్రభుత్వాలకు ముందు.. ఆ తర్వాత అని స్పష్టంగా చెప్పవచ్చు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రూ.18,000 కోట్ల బకాయిలు మాకు వారసత్వంగా వచ్చాయి. పోలవరం ప్రాజెక్టును జగన్‌ ధ్వంసం చేశారు. 2020 లో వచ్చిన భారీ వరదకు డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిందో లేదో అవగాహన లేకుండానే.. వరుసగా 2021, 22, 23ల్లో ప్రాజెక్టును ప్రారంభిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటనలు చేశారు. ఆయన ప్రభుత్వంలో జల వనరుల మంత్రిగా పనిచేసిన అనిల్‌కుమార్‌ యాదవ్‌.. పోలవరాన్ని తామే పూర్తి చేస్తామని పదే పదే అసెంబ్లీలో మాట్లాడారు. ఆ తర్వాత ఆ శాఖ మంత్రిగా వచ్చిన అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు తనకు అర్థం కానందున ఎవరికీ అర్థం కాదన్నారు.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే.. ప్రాజెక్టు పనులు చేస్తున్న ప్రధాన కాంట్రాక్టు సంస్థలను అర్ధాంతరంగా జగన్‌ పంపేశారు. 17 నెలలపాటు రివర్స్‌ టెండర్‌ పేరిట పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాం. దానిపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం పనులు శరవేగంగా జరగుతున్నాయి. 2027 మార్చి నాటికి తొలిదశ పూర్తిచేస్తాం. జగన్‌ తన హయాంలో నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిహారం చెల్లిస్తున్నాం. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను తరలిస్తాం’ అని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయకుండానే సార్వత్రిక ఎన్నికలకు ముందు జాతికి అంకితం చేశానంటూ హడావుడి చేసి రాష్ట్ర ప్రజలను.. వెనుకబడిన ప్రకాశం జిల్లాను జగన్‌ మోసం చేశారని మండిపడ్డారు. 7225 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజీ అందించకుండానే చెల్లించేసినట్లుగా ప్రకటించిన దగాకోరని ధ్వజమెత్తారు. 2028 నాటికి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. హంద్రీ-నీవా సహా రాయలసీమ ప్రాజెక్టులన్నింటినీ శరవేగంగా పూర్తి చేస్తున్నామని.. శ్రీశైలం నుంచి తిరుపతి దాకా కృష్ణా జలాలను తరలిస్తామని చెప్పారు. రాయలసీమలో ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిని వైసీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి.. ఆ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనే వెల్లడించారని.. దీంతో జగన్‌ చానల్‌ ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని నిలుపుదల చేసిందని..ఈ రోజుల్లో సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకునే వెసులుబాటు ఉందన్న విషయాన్ని విస్మరించిందని ఎద్దేవాచేశారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాగునీటికి తీవ్ర ఇబ్బంది నెలకొందన్నారు. ‘25 ఏళ్లలో తొలిసారి గోదావరి నదిలో ప్రవాహం తగ్గిపోయింది. కృష్షానదిపై నిర్మించిన ఆలమట్టి, నారాయణపూర్‌, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో నిల్వలు లేవు. చంద్రబాబు ముందు చూపుతో పులిచింతలలో 30 టీఎంసీలు నిల్వ చేశారు. పట్టిసీమను జగన్‌ వట్టిసీమ అన్నారు. ఇప్పుడీ పట్టిసీమే కృష్ణా ఆయకట్టును ఆదుకుంటోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలి’ అని నిమ్మల సూచించారు.

Updated Date - Jul 22 , 2026 | 06:37 AM