జగన్ ప్రభుత్వంలో 3500 కోట్ల మద్యం స్కాం
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:12 AM
జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3500 కోట్ల మద్యం స్కాం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలను పూర్తిగా డిజిటలైజ్ చేశాం’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో అంతా డిజిటలైజేషన్
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 30-50 శాతం పెరిగాయి: మంత్రి కొల్లు
గుంటూరు కార్పొరేషన్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ‘జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3500 కోట్ల మద్యం స్కాం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మద్యం అమ్మకాలను పూర్తిగా డిజిటలైజ్ చేశాం’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం గుంటూరులోని ఎక్సైజ్ రీజనల్ ల్యాబ్‌ను ఆయన పరిశీలించారు. మద్యం నాణ్యతా ప్రమాణాలను ఏ విధంగా పరిశీలిస్తారు? కల్తీ మద్యాన్ని ఎలా గుర్తిస్తారు? వంటి అంశాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దు రాష్ర్టాల ద్వారా రాష్ట్రంలో అమ్మకాలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరు జిల్లాలలోని ల్యాబ్‌లను రూ.12 కోట్లతో ఆధునికీకరించాం. జగన్ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారు. దానివల్ల 30 వేల మంది చనిపోయారు. లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. 2023వ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 14,000 శాంపిల్స్ మాత్రమే వైసీపీ ప్రభుత్వం చూస్తే... మా ప్రభుత్వం ప్రతి నెలా 39 వేల శాంపిల్స్‌ను తనిఖీ చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌ని వినియోగించుకోవాలి’ అని కొల్లు సూచించారు. కార్యక్రమంలో గుంటూరు ఎక్సైజ్ శాఖ డీసీ డాక్టర్ కే శ్రీనివాసులు, ఈఎస్ అరుణ కుమారి, ఏఈఎస్ మారయ్య బాబు, అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు-అమరావతి రహదారిలోని విజయ శ్రీ వైన్స్ షాపును మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. మద్యం బాటిల్ తీసుకొని ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో పరిశీలించారు. షాప్‌లో ఉన్న స్టాక్‌ను చూసి, అమ్మకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
శాఖపై సమీక్ష
ఎక్సైజ్ శాఖలో పారదర్శకత, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అన్ని చర్యలను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, లోపాలు కనిపిస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడొద్దని స్పష్టం చేశారు. మీడియాలో వచ్చే ప్రతికూల వార్తలపై తక్షణమే స్పందించి వాస్తవాలను ధ్రువీకరించి అవసరమైతే రీజాయిండర్ల విడుదల చేయాలని స్పష్టం చేశారు. లిక్కర్‌లో కల్తీ, అక్రమ అమ్మకాలు జరగకుండా పర్మిట్‌రూమ్స్, షాపులు, బార్లు, ఇన్‌హౌస్ ఎస్టాబ్లిష్ మెంట్లపై తరచుగా తనిఖీలు నిర్వహించాలని, ఉల్లంఘనలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ చామకూరి శ్రీధర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.