Share News

తుంగభద్ర డ్యాంలో 32 టీఎంసీల పూడిక..!

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:49 PM

తుంగభద్ర డ్యాం డిజైన 132.473 టీఎంసీల నిల్వ సామర్థ్యం. ప్రస్తుతం వంద టీఎంసీలు కూడా నిల్వ ఉండడం లేదని టీబీపీ బోర్డు అధికారుల అంచనా. అంటే..

   తుంగభద్ర డ్యాంలో   32 టీఎంసీల పూడిక..!
తుంగభద్ర డ్యాంలో చేరిన పూడిక (ఫైల్‌)

పదేళ్లకు ఒకసారి నీటి సామర్థ్యంపై సర్వే

భారీగా పూడిక చేరడంతో నీటివాటాపై భారీగా కోత

తుంగభద్ర జలాలపై హైపవర్‌ కమిటీ

పూడికతీతకే ప్రాధాన్యత - తొలి భేటీలో నిర్ణయం

సాధ్యసాధ్యాలపై అధ్యయనానికి సబ్‌ కమిటీ ఏర్పాటు

నేడు హోస్పెట్‌లో ప్రత్యేక భేటీ

కర్నూలు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం డిజైన 132.473 టీఎంసీల నిల్వ సామర్థ్యం. ప్రస్తుతం వంద టీఎంసీలు కూడా నిల్వ ఉండడం లేదని టీబీపీ బోర్డు అధికారుల అంచనా. అంటే.. దాదాపు 32-33 టీఎంసీలు పూడిక చేరింది. తద్వారా నీటి సామర్థ్యం తగ్గిపోవడంతో ఏపీ కోటాలో భాగంగా రాయలసీమ జిల్లాలకు అందుతున్న నీటివాటాలో భారీగా కోత పడుతుంది. పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని వినియోగించుకోవడానికి కర్ణాటక నవలి ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. హెచ్చెల్సీ సమాంతర కాలువ నిర్మించాలని ఏపీ ప్రతిపాదించింది. దశాబ్దాలుగా ప్రతిపాదనలతోనే ఆగిపోయాయి. గత జూన 25న తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్లు ప్రారంభోత్సవానికి హాజరైన కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల తుంగభద్ర జలాల వినియోగంపై చర్చించారు. వారి అభ్యర్థన మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ హైపవర్‌ కమిటీ (హెచపీసీ) ఏర్పాటు చేసింది. ఏప్రిల్‌ 27న జరిగిన ఆ కమిటీ తొలి భేటీలో డ్యాంలో పూడికతీతకు ప్రాధాన్యత ఇచ్చింది. పూడికతీత సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ హైపవర్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నేడు హోస్పెట్‌లోని తుంగభద్ర బోర్డు కార్యాలయంలో తొలిసారిగా భేటీ కానుంది. డ్యాంలో పూడికతీత సాధ్యమేనా..? డ్యాం సామర్థ్యం ఏఏ సంవత్సరాల్లో సర్వే చేశారు..? ఎంత పూడిక చేరిందని నిర్ధారించారు..? సబ్‌ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త జలాశయం తుంగభద్ర. నీటి నిల్వ 132.473 టీఎంసీల సామర్థ్యంతో డిజైన చేసి 1953లో నిర్మించారు. జూన ఒకటో తేదీ నుంచి మే 31 వరకు ఒక నీటి సంవత్సరంలో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ 212 టీఎంసీలు వినియోగించుకునేలా ఈ ప్రాజెక్టుకు డిజైన చేశారు. కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రిబ్యూనల్‌ (కేడబ్ల్యూడీటీ) అవార్డు-1 కేటాయింపుల ప్రకారం కర్ణాటక 138.99 టీఎంసీలు, ఏపీ, తెలంగాణ ఉమ్మడిగా 73.01 టీఎంసీలు వాడుకోవాలి. ఏపీ నీటి వాటా 66.50 టీఎంసీలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్లెల్సీ కాలువకు 24 టీఎంసీలు, కేసీ కాలువకు 10 టీఎంసీలు, అనంతపురం జిల్లాలో హెచ్చెల్సీ ద్వారా 32.50 టీఎంసీలు కేటాయించారు. ఏటా టీబీ బోర్డు వాటర్‌ రివ్యూ కమిటీ సమావేశమై డ్యాంలో చేరే వరదను అంచనా వేస్తుంది. కేడబ్ల్యూడీటీ కేటాయింపుల దామాషా ప్రకారం నీటి వాటా కేటాయింపులు చేస్తారు. డ్యాం ఎగువ భాగంలో వ్యవసాయ భూములు, కొండలు తదితర ప్రాంతాల నుంచి ఏటేటా పూడికి చేరుతూ వస్తుంది. అయితే.. 10-12 ఏళ్లకు ఒకసారి డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యంపై తుంగభద్ర బోర్డు ఉన్నత కమిటీ సర్వే చేసి అంచనా వేస్తుంది. ఏటేటా డ్యాంలో చేరే నీటిని అంచనా వేసి కేడబ్ల్యూడీటీ అవార్డు-1 కేటాయింపుల ప్రకారం మూడు రాష్ట్రాలకు పంపకాలు చేస్తున్నారు. అయితే డ్యాంలో 32-33 టీఎంసీలు పూడిక చేరడంతో నీటి వాటా భారీగా కోల్పోతున్నాం.. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి నవలి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని కర్ణాటక రాష్ట్రం ప్రతిపాదిస్తుంది. అదే క్రమంలో అనంతపురం, కడప జిల్లాకు సాగు, తాగునీరు అందించే హెచ్చెల్సీ కాలువకు సమాంతర కాలువ నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తూ వచ్చింది.

ఫ తుంగభద్ర జలాల వినియోగంపై హైపవర్‌ కమిటీ

ఈ ఏడాది జూన 25న నూతనంగా ఏర్పాటు చేసిన తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్లు ప్రారంభోత్సవానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, ఏపీ, కర్ణాటక, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, డీకే శివకుమార్‌, రేవంతరెడ్డిలు హాజరై.. ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తుంగభద్ర జలాలు వినియోగం, పరీవాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అందించాల్సన సహకారంపై చర్చించారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను కేంద్రం పరిష్కరించాలని ముగ్గురు సీఎంలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగానే జూలై 13న 9 మంది సభ్యులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ హైపవర్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీకి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యుడిని చైర్మనగా నియమించింది. తుంగభద్ర బోర్డులో సభ్యులుగా ఉన్న మూడు రాష్ట్రాల ఈఎనసీలు, సీడబ్ల్యూసీకి చెందిన పలు విభాగాల చీఫ్‌ ఇంజనీర్లు, బోర్డు కార్యదర్శిని సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ అదే నెల 28న ఢిల్లీలో తొలి భేటీ అయింది. తుంగభద్రలో పూడికతీతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతే ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే డ్యాంలో పెరుకుపోయిన పూడికతీత సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు హైపవర్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నేడు విజయనగరం జిల్లా హోస్పెట్‌లోని తుంగభద్ర బోర్డు కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు ఎస్‌ఈ నారాయణ్‌ నాయక్‌ సబ్‌ కమిటీ సభ్యులను సర్క్యూలర్‌ పంపించారు.

ఫ తగ్గిన సామర్థ్యం.. సీమ కాలువలపై ప్రభావం

ఫ తుంగభద్ర డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 132.473 టీఎంసీలు. 1953 నుంచి డ్యాంలో నీటి నిల్వపై ఏడు సార్లు తుంగభద్ర బోర్డు నియమించిన నిపుణుల కమిటీ సర్వే చేసి సామర్థ్యంపై అంచనా వేస్తూ వచ్చింది. 2016-17లో చివరిగా సర్వే చేసి 100.85 టీఎంసీలకు ఉంటుందని అంచనా వేశారు. తరువాత సవరించి 105.788 టీఎంసీలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం వంద టీఎంసీలకు పడిపోయిందని బోర్డు అధికారులు అంటున్నారు.

ఫ కర్నూలు జిల్లాలో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే టీబీపీ ఎల్లెల్సీ నీటి వాటా 24 టీఎంసీలు. ప్రస్తుతం ఏటా సగటున 16-18 టీఎంసీలకు మించి కేటాయింపులు చేయడం లేదు. కేసీ వాటా 10 టీఎంసీలు ఉన్నా 7-8 టీఎంసీలకు మించి ఇవ్వడం లేదు.

ఫ అనంతపురం, కడప జిల్లాల్లో 2.94 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే హెచ్చెల్సీ నీటి వాటా 32.50 టీఎంసీలు. 23-25 టీఎంసీలకు మించి రావడం లేదు. ఫలితంగా 95-1.05 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందని పరిస్థితి.

ఫ ఏపీ, కర్ణాటక ప్రతిపాదనలు:

---------------------------

ఫ తుంగభద్ర డ్యాంలో ఏటేటా సగటున 0.424 టీఎంసీల మేరకు పూడిక చేరుతుందని అంచనా. ఇప్పటి వరకు 32-33 టీఎంసీలు పూడిక చేరిందని అంచనా వేస్తున్నారు.

ఫ పూడిక వల్ల నీటి సామర్థ్యం తగ్గిపోవడం వల్ల.. ఆ నీటివాటాను వినియోగానికి డ్యాం దిగువ నుంచి అనంతపురం జిల్లా వరకు హెచ్చెల్సీ సమాంతరంగా వరద కాల్వ (ఫ్లెడ్‌ఫ్లో కెనాల్‌) నిర్మించాలనే డిమాండ్‌ను ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ముగ్గురు సీఎంలు ఎన్టీఆర్‌, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు కర్ణాటక ప్రభుత్వం, సీఎంలో చర్చలు జరిపారు. 2014 నవంబరు 4న అప్పటి సీఎం చంద్రబాబు కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో చివరిసారిగా చర్చలు జరిపారు.

ఫ తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల నష్టపోతున్న నీటిని వినియోగించుకోవడానికి 30 టీఎంసీలు సామర్థ్యంలో కొప్పల్‌ జిల్లా గంగావతి సమీపంలో నవలి జలాశయం నిర్మాణం చేస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఫ హెచ్చెల్సీ సమాంతర కాలువకు కర్ణాటక ఒప్పుకోలేదు. నవలి ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరం చెబుతుంది. దీంతో ఈ రెండు పెండింగులో ఉన్నాయి. తాజాగా తుంగభద్ర నదిపై గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

ఫ నేటి భేటీలో పూడికతీతపై చర్య

తుంగభద్ర జలాల వినియోగంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ (హెచపీసీ) చైర్మనగా టీబీపీ బోర్డు కార్యదర్శి శ్రీనివాస బైరి, సభ్యులుగా ఏపీ నుంచి ఒంగోలు ప్రాజెక్ట్స్‌ సీఈ రమేశ, కర్ణాటక నుంచి ఆ రాష్ట్రం రిటైర్డ్‌ సీఈ ఎస్‌హెచ మంజప్ప, తెలంగాణ నుంచి వనపర్తి సీఈ మహమ్మద్‌ రహీముద్దీన సభ్యులుగా, టీబీపీ బోర్డు ఎస్‌ఈ ఎస్‌.నారాయననాయక్‌ కన్వీనర్‌, మెంబర్‌ సెక్రెటరీగా హైపవర్‌ సబ్‌ కమిటీని నియమించింది. జూలై 28న సమావేశమైన హెచపీసీ తొలి భేటీలో పూడికతీతకు ఉన్న అంశాలపై నిపుణులతో అధ్యయనం చేయించాలని, ఆ తరువాతే బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు నిర్మాణం అవసరమా లేదా అనే అంశంపై చర్చ జరగాలని ఏపీ సూచించింది. అందుకు అనుగుణంగా పూడికతీతపై అధ్యయనం కోసం సబ్‌ కమిటీని నియమించారు.

Updated Date - Sep 30 , 2026 | 11:49 PM