గోదావరి పరీవాహక ప్రాంతాల్లోరూ.37 కోట్లతో 32 ఆలయాల పునర్నిర్మాణం
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:43 AM
వచ్చే ఏడాది జరిగే గోదావరి పురష్కారాల నాటికి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని 32 ప్రధాన ఆలయాలను రూ.37 కోట్లతో పునర్నిర్మించనున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
మరో 300 ఆలయాలకూ మరమ్మతులు: మంత్రి ఆనం
నెల్లూరురూరల్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరిగే గోదావరి పురష్కారాల నాటికి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లోని 32 ప్రధాన ఆలయాలను రూ.37 కోట్లతో పునర్నిర్మించనున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ మండలంలోని వేదగిరి క్షేత్రంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రధాన ఆలయాలతోపాటు 300 చిన్న ఆలయాలకు కూడా మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఆ మరుసటి ఏడాది వచ్చే కృష్ణా పుస్కరాల నిర్వహణపై సీఎం చంద్రబాబు దావోస్ నుంచి రాగానే మంత్రివర్గ ఉపసంఘంతో సమీక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాలను టీటీడీతోపాటు తమ శాఖ నిధులతో నిర్మించనున్నట్టు వెల్లడించారు. వేదపండితులుగా గుర్తింపు పొందిన రాష్ట్రంలోని 599 మందికి మూడేళ్లపాటు నెలకు రూ.3 వేలు చొప్పున సంభావన అందచేస్తున్నట్టు చెప్పారు. 112 ఆలయాల్లోని అర్చకులకు నెలకు రూ.15 వేలు చొప్పున రూ.11.43 లక్షలు, ధూప, దీప నైవేద్యాలకు 450 ఆలయాలకు రూ.10 వేలు చొప్పున రూ.45 లక్షలు ప్రతి నెల తమ శాఖ నుంచి చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు.