అంబటిపై 3 కేసులు
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:23 AM
సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటిపై గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.
గుంటూరులో 2.. పల్నాడులో ఒకటి నమోదు
రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి అల్లర్ల సృష్టికి ప్రయత్నిస్తున్నారని గుంటూరు ఎస్పీకి టీడీపీ ఫిర్యాదు
గుంటూరు/కంచరపాలెం (విశాఖపట్నం), జనవరి 31 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటిపై గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును దూషించినందుకు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ రెస్టారెంట్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు అంబటి రాంబాబు వచ్చిన సమయంలో పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రోడ్డుపై వాహనాన్ని పార్కింగ్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించారు. ఎస్‌ఐ రామకృష్ణ రోడ్డుపై వాహనం పార్క్ చేయవద్దని చెప్పినందుకు.. ‘మీరెవరు నాకు చెప్పడానికి’ అంటూ ఆయనపై దౌర్జన్యం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీ్‌సస్టేషన్‌లో అంబటి, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. పల్నాడు జిల్లా నకరికల్లులో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చౌదరి ఫిర్యాదు మేరకు పోలీసులు అంబటిపై మరో కేసు నమోదు చేశారు.
ఎస్పీని కలిసిన టీడీపీ నేతలు
చంపేస్తా.. ఫ్లెక్సీలు చించేస్తా అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్న అంబటిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఇతర పార్టీ నేతలతో కలిసి గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్‌కు శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. టీడీపీ శ్రేణులను అసభ్యపదజాలంతో తిడుతూ చంపేస్తానని బెదిరించారన్నారు. చంద్రబాబును కూడా దమ్ముంటే రమ్మంటూ బూతులతో తిట్టి, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అటు చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలపై విశాఖపట్నంలోని 54వ వార్డు టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.