జూన్ నాటికి అర్బన్‌లో 2.6 లక్షల ఇళ్ల నిర్మాణం
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:24 AM
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సొంతిల్లు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఏడాది జూన్ నాటికి 2.6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నామని...
మున్సిపాలిటీలకు కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి: మంత్రి నారాయణ
విశాఖపట్నం, మార్చి 15(ఆంధ్రజోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సొంతిల్లు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ఏడాది జూన్ నాటికి 2.6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. విశాఖలో ఆదివారం ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ వర్క్‌షా్‌పలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ఆర్.కటికితాలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పట్టణ మౌలికవసతుల అభివృద్ధికి పెట్టుబడులను సమీకరించడం, పట్టణ స్థానిక సంస్థల సామర్థ్యాన్ని పెంచడం కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 90కిపైగా మునిసిపాలిటీలు, 9 మునిసిపల్ కార్పొరేషన్లకు నిధులు పరిమితంగా ఉన్నందున కొత్త ఆదాయ మార్గాలపై దృష్టిసారించామని చెప్పారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ‘రైడర్స్’ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించిందని, రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయితే మూడేళ్లలోగా మెట్రోరైల్ ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీనివాస్ ఆర్.కటికితాల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలకు సహకారం అందించేందుకు 22 అర్బన్ ఇన్వె్‌స్ట్‌మెంట్ విండో కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల సమీకరణపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపారు.