ఇక 24 గంటల్లో డెలివరీ!
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:44 AM
వినియోగదారులకు వేగవంతమైన, భరోసాతో కూడిన సేవలను అందించేందుకు తపాలా శాఖ సిద్ధమైంది. పోస్టు చేసిన మరుసటి రోజునే గ్యారెంటీగా డెలివరీ చేసేందుకు...
24-స్పీడ్ పోస్ట్, 24-స్పీడ్ పోస్ట్ పార్శిల్ సేవలు షురూ
న్యూఢిల్లీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు వేగవంతమైన, భరోసాతో కూడిన సేవలను అందించేందుకు తపాలా శాఖ సిద్ధమైంది. పోస్టు చేసిన మరుసటి రోజునే గ్యారెంటీగా డెలివరీ చేసేందుకు ఉద్దేశించిన ‘24 స్పీడ్ పోస్ట్’తో పాటు, 48 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్శిల్ పేరిట కొత్తగా మూడు ప్రీమియం సేవలను ప్రారంభించింది. మంగళవారం, ఢిల్లీలో కేంద్ర సమాచారశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సమాచార, గ్రామీణాభివృద్ధిశాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సేవలను ప్రారంభించారు. ప్రధాని మోదీ దార్శనికతతో 170 ఏళ్ల చరిత్ర కలిగిన తపాలా శాఖ తనను తాను ఆధునికీకరించుకుందని, క్షేత్రస్థాయిలో జరిపిన పరీక్షలు విజయవంతమైన తర్వాతే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామని జ్యోతిరాదిత్య తెలిపారు. దశాబ్ధాలుగా సమాచారాన్ని మోసుకెళ్లిన తపాలా శాఖ ఇకనుంచి దేశ ఆర్థిక ప్రగతిని పల్లెల నుంచి ప్రపంచమార్కెట్లకు చేరవేస్తుందని పెమ్మసాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈలు, స్టార్ట్‌పలు, ఈ కామర్స్ రంగాలకు ఈ వేగవంతమైన పార్సిల్ సేవలు గొప్పవరమన్నారు. తొలిదశలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు మధ్య ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.