23 మంది భారత మత్స్యకారుల విడుదల
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:36 AM
భారతదేశానికి చెందిన 23 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌లోని బాగేర్‌హట్ జైలు నుంచి విడుదలయ్యారు. వీరిలో తొమ్మిది మంది విజయనగరం జిల్లాకు చెందినవారు ఉన్నారు.
వీరిలో తొమ్మిది మంది విజయనగరం జిల్లావాసులే
విశాఖపట్నం/భోగాపురం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): భారతదేశానికి చెందిన 23 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్‌లోని బాగేర్‌హట్ జైలు నుంచి విడుదలయ్యారు. వీరిలో తొమ్మిది మంది విజయనగరం జిల్లాకు చెందినవారు ఉన్నారు. మంగళవారం భారత డిప్యూటీ హై కమిషనర్ చంద్రజీత్ ముఖర్జీ, బంగ్లాదేశ్ హోం, విదేశాంగ శాఖల అధికారులు, పోలీసులు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్ సమక్షంలో వీరిని జైలు నుంచి విడుదల చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న పరస్పర ఖైదీల అప్పగింత ఒప్పందం మేరకు వీరిని గురువారం బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాల్లో భారత కోస్ట్‌గార్డు అధికారులకు అప్పగించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మరుపల్లి చిన్నఅప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, అప్పలకొండ, పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన నక్కా రమణ, వాసపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న విశాఖపట్నంలోని జాలరుపేటలో నివాసం ఉంటూ సముద్రంలో చేపల వేటతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ తొమ్మిది మంది గతేడాది అక్టోబరు 13న సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ అదే నెల 22న వీరిని బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మన దేశానికి చెందిన మరో 14 మంది మత్స్యకారులను కూడా అరెస్టు చేశారు. అప్పటి నుంచి మూడు నెలలకుపైగా వీరంతా అక్కడ జైల్లో ఉన్నారు. వారి విడుదల కోసం విశాఖ ఎంపీ శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. ఎట్టకేలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం వారిని విడుదల చేసిందని అక్కడకు వెళ్లిన ఈస్ట్‌కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు. 29 నాటికి అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకొని బంగ్లాదేశ్ అధికారులు స్వాధీనం చేసుకున్న వీరి పడవపైనే తిరిగి స్వస్థలాలకు రానున్నారు. వీరి విడుదలపై విజయనగరం జిల్లాలోని వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.