Share News

ఔరా.. సాహస బాలా!

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:29 AM

అసాధ్యం అనుకున్న దానిని దివ్యాంగ విద్యార్థులు సుసాధ్యం చేశారు. వినికిడి, దృష్టిలోపం, ఇతర వైకల్య సమస్యలతో సతమతమవుతూ చదువుకోవడమే కష్టమన్న స్థాయిని దాటి ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ను అధిరోహించారు.

ఔరా.. సాహస బాలా!

  • వైకల్యాన్ని జయించి.. ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌నకు

  • 21 మంది దివ్యాంగ విద్యార్థుల ఘనత

  • 13 మంది బాలురు.. 8 మంది బాలికలు

  • అంతా ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులే

  • 10 రోజుల్లో విజయవంతంగా అధిరోహణ

  • 5364 మీటర్ల ఎత్తులో బేస్‌ క్యాంప్‌

  • సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కఠిన శిక్షణ

  • రేపటి తరానికి రోల్‌ మోడల్స్‌: లోకేశ్‌

అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): అసాధ్యం అనుకున్న దానిని దివ్యాంగ విద్యార్థులు సుసాధ్యం చేశారు. వినికిడి, దృష్టిలోపం, ఇతర వైకల్య సమస్యలతో సతమతమవుతూ చదువుకోవడమే కష్టమన్న స్థాయిని దాటి ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ను అధిరోహించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న 21 మంది దివ్యాంగ విద్యార్థులు 10 రోజుల్లోనే 5364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్‌ క్యాంప్‌ను చేరుకున్నారు. దేశంలో ప్రభుత్వ విద్యార్థులు.. అందులోనూ దివ్యాంగులు ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ను అధిరోహించడం ఇదే తొలిసారని ప్రభుత్వం వెల్లడించింది. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఈ నెల 16న బేస్‌ క్యాంప్‌ యాత్ర ప్రారంభించారు. అంతకుముందు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ అమరావతిలో విద్యార్థులను కలిసి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. 15వ తేదీన నేపాల్‌లోని ఖాట్మండు చేరుకున్న విద్యార్థులు.. 16న నేపాల్‌లోని లుక్లాలో ట్రెక్కింగ్‌ మొదలుపెట్టారు. తొలుత లుక్లా నుంచి 2800 మీటర్ల ఎత్తులో ఉన్న పాక్కిండ్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి నామ్‌చ బజార్‌, డిబోచి, ప్యాంగ్‌బోచి, డింగ్‌బోచి, తుగ్లా, లోబుచి, గోరక్‌ షెప్ప మీదుగా యాత్ర కొనసాగించారు.


శనివారం మధ్యాహ్నం బేస్‌ క్యాంప్‌ చేరుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. 30వ తేదీ నాటికి తిరిగి లుక్లా చేరుకుంటారు. విద్యార్థులకు మార్గమధ్యంలో వైద్య సదుపాయాలు, ఆహారం, చలిని తట్టుకునేలా ప్రణాళికలను సమగ్రశిక్ష పక్కాగా పర్యవేక్షించింది. మార్గమధ్యంలో అవకాశం ఉన్న చోట్ల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తూ ప్రయాణం సాగించారు. 21 మందిలో 13 మంది బాలురు, 8 మంది బాలికలు ఉన్నారు. వీరితో పాటు అడ్వెంచర్స్‌ స్పోర్ట్స్‌ అకాడమీ పర్వతారోహకులు షేక్‌ హిమాన్షు, మలావత్‌ పూర్ణ, సమగ్రశిక్ష నుంచి కె.శంకరయ్య యాత్రలో భాగస్వాములై విద్యార్థులను పర్యవేక్షించారు. యాత్ర ప్రారంభించినప్పుడు సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు కూడా లుక్లా వెళ్లి విద్యార్థులతో కలిసి కొంతదూరం ప్రయాణించారు. ఈ యాత్రకు మందు రాష్ట్రవ్యాప్తంగా 900 మంది విద్యార్థులను ఎంపిక చేసి వడపోయగా, చివరికి 21 మందిని సన్నద్ధం చేశారు. మొదట ఈ విద్యార్థులకు కఠినమైన శిక్షణ ఇచ్చారు. తొలుత గండికోట అడ్వెంచర్‌ అకాడమీలో శిక్షణ ఇచ్చి, తర్వాత లద్దాఖ్‌లో మైనస్‌ 5 డిగ్రీల చలి లో విద్యార్థులను సన్నద్ధం చేశారు.


యాత్రకు వెళ్లిన విద్యార్థులు వీరే

8వ తరగతి విద్యార్థి ఎర్రమాల కీర్తన(నంద్యాల), 9వ తరగతి విద్యార్థులు.. కాలగట్ల శివలక్ష్మి (కర్నూలు), ఎస్‌.డి.రిహానా(కర్నూలు), నీలకంటి మధు తనూజ(నంద్యాల), దూదేకుల అభిధ యశ్విన్‌(నంద్యాల), బండి స్వాతి(నంద్యాల), పితాని రూపసాయిశ్రీ(కాకినాడ), వెలుగు విజ్ఞానసాయి(శ్రీకాకుళం) ఉన్నారు.

10వ తరగతి విద్యార్థులు.. చల్లా పవన్‌కుమార్‌(అనకాపల్లి), లెక్కల హరిశ్రీ దుర్గాప్రసాద్‌(విశాఖపట్నం), పాలస ప్రసాద్‌(శ్రీసత్యసాయి), పత్తికొండ పునీత్‌సాయి(తిరుపతి), యర్లబోయిన వెంకీ(కడప), అంబటి తెలుగు దేవేంద్ర(నంద్యాల), తలారి మధు మనోజ్‌(నంద్యాల), దూదేకుల మౌలాలి(నంద్యాల), గట్టెం విశ్వా్‌స్(విజయవాడ), అన్నంనేడి దైవ వెంకట సత్యనారాయణ(పశ్చిమగోదావరి) ఉన్నారు. అలాగే, ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థుఉలు బెల్లపు దిలీప్ కుమార్‌(అన్నమయ్య), బుడిద మణికంఠ(శ్రీకాకుళం), ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థి బోడిరెడ్డి సింధు(తిరుపతి) యాత్రకు వెళ్లారు.


గర్వ కారణం: లోకేశ్‌

దివ్యాంగ విద్యార్థులు ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ను అధిరోహించడం తనకు గర్వకారణమని మంత్రి లోకేశ్‌ అన్నారు. ‘వైకల్యాన్ని అడ్డంకిగా భావించే సమాజానికి మీ ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సమాధానం. 5364 మీటర్ల ఎత్తులో ఉన్న మంచు శిఖరాలను అధిరోహించడం అంటే కేవలం ఒక కొండను ఎక్కడంలా చూడకూడదు. ఇది మీపై ఉన్న అపనమ్మకాలను, అవమానాల ను అధిగమించి శిఖర సమానమైన ఎత్తుకు ఎదగడం. ఏటా ఇలా విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తాం. మీరు రేపటి తరానికి రోల్‌ మోడల్స్‌. విజయవంతంగా సాహసయాత్రను పూర్తిచేసి తిరిగి వస్తున్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 04:30 AM