మేలో టీచర్ల బదిలీలు
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:10 AM
ఉపాధ్యాయ బదిలీలు మే నెలలో చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సుమారు 20వేల మంది టీచర్లు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉందని అంచనా.
20 వేల మంది బదిలీ అయ్యే అవకాశం
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలు మే నెలలో చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సుమారు 20వేల మంది టీచర్లు ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉందని అంచనా. బదిలీల్లో ఇచ్చే సర్వీస్ పాయింట్లకు గతేడాది తరహాలో డెసిమల్స్‌లోనే పాయింట్లు ఇవ్వనున్నారు. పలు అంశాలపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో మంగళగిరిలోని విద్యాభవన్‌లో సమావేశం నిర్వహించారు. టెన్త్ పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారుల బాధ్యతల కేటాయింపుపై ప్రధానంగా చర్చ జరిగింది. చాలామంది టీచర్లను దూర ప్రాంతాల్లోని కేంద్రాలకు కేటాయించారని, వాటిని మార్చాలని ప్రతినిధులు కోరారు. బాగా ఎక్కువ దూరం కేటాయించిన వారిని మారుస్తామని అధికారులు చెప్పారు. 50 శాతంపైగా టీచర్లకు బాధ్యతలు ఇచ్చిన 79 పాఠశాలల్లో నిబంధనల మేరకు మార్పులు చేయనున్నారు. జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పుడు అన్ని తరగతుల విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు నిర్వహించాలని అధికారులు స్పష్టం చేశారు.