State Food Processing and Industries Dept: ఫుడ్ ప్రాసెసింగ్‌కు పెద్దపీట
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:11 AM
రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ద్వారా రూ. 20 వేల కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్...
పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవిచౌదరి
మండపేట, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ద్వారా రూ. 20 వేల కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి గ్రామం శివారు వేములపల్లిలో సోమవారం నాలుగు రాష్ట్రాలకు సంబంధించి వక్క రైతుల అవగాహన సదస్సుకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో ఓర్వకల్లు, విశాఖ, కుప్పంలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. మహిళా సంఘాలు, యువత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎంఎఫ్ ద్వారా వ్యక్తిగతంగా రూ.10 లక్షల నుంచి, గ్రూపునకు రూ.3 కోట్ల వరకు రుణాలు సబ్సిడీతో కూడినవి ఇవ్వనున్నట్టు చిరంజీవిచౌదరి చెప్పారు. ఈ పరిశ్రమలకు ఏపీఐఐసీ ద్వారా భూమి కేటాయిస్తామన్నారు. వక్క ద్వారా తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్‌తో పాటు, వక్క బెరడు ద్వారా ప్లేట్‌లు తయారు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో 62 శాతం వక్కసాగు ఏపీలోనే ఉందన్నారు. వక్కకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు.