CS K. Vijayanand: 20 రోజుల్లో ఉద్యోగులకు పదోన్నతులు!
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:42 AM
ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైమ్ షెడ్యూల్ నిర్ణయించింది.
అత్యవసర మెమో జారీ చేసిన సీఎస్
21కి హెచ్‌వోడీల నుంచి ప్రతిపాదనలు
పదోన్నతుల జీవో విడుదలకు 31 గడువు
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, ఉద్యోగంలో పురోగతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టైమ్ షెడ్యూల్ నిర్ణయించింది. దీని ప్రకారం మరో 20 రోజుల్లో ఉద్యోగులందరికీ పదోన్నతులు లభించనున్నాయి. అదేవిధంగా ఇకపై ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ కచ్చితంగా పదోన్నతులు కల్పించాలి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కె. విజయానంద్ ఆదివారం స్పెషల్ సీఎ్‌సలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, హెచ్‌వోడీలకు అత్యవసర మెమో జారీ చేశారు. శాఖలోని అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు ఈ నెల 31 నాటికి డీపీసీలు పూర్తి చేసి, పదోన్నతులకు సంబంధించిన జీవోలు కూడా జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 21 నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్‌వోడీలు సచివాలయానికి పంపాలి. 23 నాటికి సచివాలయంలోని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలన విభాగానికి పంపించాల్సి ఉంటుంది. 29 నాటికి సాధారణ పరిపాలన శాఖ డీపీసీ పూర్తి చేసి, సంబంధిత మినిట్స్‌ను ఆయా సెక్రటరీలకు పంపించాలి. 31న సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలని మెమోలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఉద్యోగుల పదోన్నతులపై అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశించారు.