ఒకే ఒక్కడు.. 20 కోట్లకు టెండర్!
ABN , Publish Date - Jul 06 , 2026 | 04:52 AM
ఉపాధి హామీ పథకాన్ని దుర్వినియోగం చేయడంలో సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆరితేరిపోయాడు. ఈ పథకం కింద రూ.కోట్ల ప్రభుత్వ నిధులను అప్పనంగా..
‘ఉపాధి’ నిధులపై కాంట్రాక్ట్ ఉద్యోగి కన్ను
50 బడులకు ప్రహరీల పేరుతో నకిలీ పత్రాలు
గోడలు కట్టకుండానే సొమ్ములు స్వాహా
ఎంబుక్‌లపై ఇంజనీర్ల సంతకాలు ఫోర్జరీ
ఎంపీడీవోల లాగిన్‌లోకి జొరబడి చెల్లింపులు
ఇప్పటికే రూ.2 కోట్లకు పైగా డ్రా చేసిన వైనం
‘నాడు-నేడు’లో పనులకూ మళ్లీ బిల్లులు
చక్రం తిప్పిన సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ స్కామ్ వెలుగులోకి
అతనో కాంట్రాక్టు ఉద్యోగి! కానీ.. ‘మోసాల’ టెక్నాలజీలో ఆరి తేరాడు! ఉపాధి హామీ నిధులను ఎలా మింగాలో బాగా తెలుసుకున్నాడు. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 20 కోట్ల స్వాహాకు సర్వం సిద్ధమయ్యాడు. ఇందులో రూ.2 కోట్లు ఇప్పటికే నొక్కేశాడు. కేంద్రం నిధులు మంజూరు చేస్తే.. మిగిలిన మొత్తమూ మాయమైనట్లే! ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన కుంభకోణమిది!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఉపాధి హామీ పథకాన్ని దుర్వినియోగం చేయడంలో సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆరితేరిపోయాడు. ఈ పథకం కింద రూ.కోట్ల ప్రభుత్వ నిధులను అప్పనంగా దోచుకోవడానికి భారీ స్కెచ్ వేశాడు. దీనికోసం నకిలీ శాంక్షన్లు, ఎంబుక్‌లు సృష్టించాడు. ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేశాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, రాపూరు, దగదర్తి, చిల్లకూరు, గూడూరు, కోవూరు, కొడవలూరు, నెల్లూరు రూరల్ మండలాల్లో పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం కోసం సుమారు రూ.20 కోట్ల మేర ఉపాధి మెటీరియల్ నిధులతో కలెక్టర్ పనులు మంజూరు చేసినట్లు సదరు కాంట్రాక్టు ఉద్యోగి నకిలీ పరిపాలన ఆమోద పత్రాలు పుట్టించాడు.
వాస్తవానికి ఉపాధి పథకంలో గత రెండేళ్లుగా పశుసంవర్ధక శాఖ ద్వారా మినీ గోకులాలు, పంచాయతీరాజ్ ద్వారా సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు తప్ప ఇతర పనులు చేపట్టలేదు. అయితే ఈ ఉద్యోగి మాత్రం లేని పనులు మంజూరైనట్లు పత్రాలు సృష్టించడంతో పాటు నిర్మాణాలు చేపట్టకుండానే ఉపాధి పథకానికి ప్రోగ్రాం అధికారి (పీవో)గా ఉన్న ఎంపీడీవోల లాగిన్‌లోకి జొరబడి చెల్లింపులు చేశాడు. ఈ వ్యవహారంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఆయనతో కుమ్మక్కయ్యారని ఆరోపణలున్నాయి. ఈ ఉద్యోగి గతంలో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేశాడు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ఎన్‌ఐసీ పోర్టల్‌లో ఐడీలు క్రియేట్ చేశాడు. ప్రతిపాదనలు పంపకుండానే కలెక్టర్ పనులు మంజూరు చేసినట్లు, ఆయా ఐడీలు పీడీ లాగిన్‌లోకి వచ్చేలా చక్రం తిప్పాడు. డ్వామా కార్యాలయంలోని కొందరు సిబ్బంది ఆయనకు సహకరించారని సమాచారం. ఆయా ప్రహరీలకు సంబంధించిన పనుల ఐడీలు పంచాయతీల్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ల లాగిన్‌లోకి చేరాయి. వారితో సైట్ ఫొటోలు తీయించి, వాటిని అప్‌లోడ్ చేసేందుకు స్థానికంగా ఉన్న కొందరు నేతలను వాడుకున్నట్లు తెలిసింది. తర్వాత ఆయా ప్రహరీలను నిర్మించినట్లు, వాటి నిర్మాణాలకు సంబంధించి సమగ్ర శిక్ష ఇంజనీర్లకు తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో ఎంబుక్ రికార్డు చేశారని చెబుతున్నారు. కొన్నిచోట్ల వారి కుటుంబ సభ్యుల పేర్లతో చెల్లింపులు చేయడంతో ఈ కుంభకోణంలో ఇంజనీర్ల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, రాపూరు, దగదర్తి మండలాల్లో పనులకు సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉపాధి మెటీరియల్ నిధులు మంజూరైతే మిగిలిన మండలాల్లోనూ బిల్లులు చెల్లించే అవకాశం ఉంది.
ఎప్పుడో చేసిన పనులకూ చెల్లింపులు
నెల్లూరు జిల్లాలోని రెండు పాఠశాలలకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద నిర్మించిన ప్రహరీ నిర్మాణాలకు అప్పట్లోనే బిల్లులు చెల్లించారు. పనులు అసంపూర్తిగా ఉన్నాయని సోషల్ ఆడిట్ తనిఖీల్లో తేలడంతో ఆ పనులకు రికవరీ పెట్టారు. వీటికి సంబంధించి రెండుసార్లు ఎంబుక్ రికార్డు చేసి నిధులు స్వాహా చేశారు. నాడు-నేడు పోర్టల్ ప్రకారం ఈ జిల్లాలోని నల్లగొండ్ల గ్రామంలో 2019 నాటికి ప్రహరీ నిర్మాణం ఉంది. అయినా అదే జీపీఎస్ స్థానానికి కొత్త వర్క్ ఐడీ సృష్టించి మరోసారి బిల్లులు చెల్లించారన్న ఆరోపణలున్నాయి.
పీఆర్, ఇరిగేషన్‌లోనూ ఇదే తంతు
సమగ్రశిక్షలో చక్రం తిప్పిన ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, నీటిపారుదల శాఖలో కూడా ఇదే విధంగా ఫేక్ వర్క్‌లు సృష్టించి ఉపాధి నిధులు దోచుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. పలు మండలాల్లో పంచాయతీరాజ్‌కు సంబంధించి పలు పనులకు ఐడీలు సృష్టించి బిల్లులు అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖలో కూడా పలు పనులు చేపట్టినట్లు రికార్డులు సృష్టించి మెటీరియల్ నిధులు స్వాహా చేసినట్లు సమాచారం. దాదాపు 20మంది ఎంపీడీవోలు, 30మంది ఇంజనీర్లు, మరో 50మంది ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యమే ఈ దోపిడీకి కారణమని తెలుస్తోంది. ఈ కుంభకోణంపై శాఖాపరమైన విచారణతో పాటు సీడీఐ విచారణ జరిపితేనే అసలైన దోషులు వెలుగులోకి వస్తారని పలువురు సూచిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లోనూ ఇలాంటి స్కాంలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఉపాధిలో పనుల మంజూరు ఇలా...
ఉపాధి హామీ పథకంలో పనులకు సంబంధించి ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో ఎస్టిమేట్ తయారుచేస్తే ఆటోమేటిక్‌గా ఐడీ క్రియేట్ అవుతుంది. దాని నంబరుతో డ్వామా పీడీల ద్వారా కలెక్టర్లకు పరిపాలనా ఆమోదానికి పంపుతారు. కలెక్టర్ పనులు మంజూరు చేసిన తర్వాత ఆయా శాఖలు సాంకేతికంగా శాంక్షన్‌లు చేస్తాయి. అనంతరం భువన యాప్‌లోకి వస్తాయి. ఆయా పనులకు సంబంధించిన సైట్ ఫొటోను ఫీల్డ్ అసిస్టెంట్ అప్‌లోడ్ చేయడంతో పనులు ప్రారంభించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది. అనంతరం మస్టర్లు బుక్ చేయడం, పనులు పూర్తయితే సంబంధిత ఇంజనీర్లు ఎంబుక్ రికార్డు చేసి ఎన్‌ఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పీవో లాగిన్‌లోనే జరుగుతుంది.