4 నెలల్లో 2 లక్షల సౌర విద్యుత్ కనెక్షన్లు!
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:17 AM
రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వినియోగాన్ని వేగవంతంగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. మార్చి నాటికి సుమారు 1.5 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు...
పునరుత్పాదక ఇంధనంలో రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా నిలపాలి: సీఎస్
తిరుపతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వినియోగాన్ని వేగవంతంగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. మార్చి నాటికి సుమారు 1.5 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు, మే నాటికి మొత్తం 2లక్షల కనెక్షన్లను పూర్తి చేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సిబ్బంది, అధికారుల పర్యవేక్షణ కీలకమని చెప్పారు. బుధవారం తిరుపతిలో ఎస్పీడీసీఎల్ సీఎండీ ఎల్.శివ శంకర్, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీ సత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల కలెక్టర్లు, నెడ్‌క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ ఆయుబ్ ఖాన్ తదితరులతో విద్యుత్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలు, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్ మౌలిక సదుపాయాల అమలును నిర్దిష్ట కాల పరిమితితో వేగవంతం చేయాలని ఎస్పీడీసీఎల్, నెడ్‌క్యాప్ అధికారులను ఆదేశించారు. పీఎం సూర్య ఘర్- ముఫ్త్‌బిజ్లీ యోజనపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, అనుమతులు, కమిషనింగ్ ప్రక్రియలను సులభతరం చేయాలని సూచించారు. ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్న కలెక్టర్ల సదస్సులో వీటి పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు. వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా వెంటనే మీటరింగ్ పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు జరిగినా డీఈలు, ఏడీఈలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, వినియోగదారుల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.