Vijayawada: 1989 బ్యాచ్ ఎస్‌ఐల ఆత్మీయ కలయిక
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:38 AM
వారంతా 1989లో పోలీసు శాఖలో ఎస్‌ఐలుగా అడుగుపెట్టారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టు ఎక్కి వారిలో కొందరు అదనపు ఎస్పీ స్థాయికి ఎదిగారు.
ఉభయ రాష్ట్రాల నుంచి 170 మంది హాజరు
37 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్క చోటకు
విజయవాడ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): వారంతా 1989లో పోలీసు శాఖలో ఎస్‌ఐలుగా అడుగుపెట్టారు. ఉద్యోగంలో ఒక్కో మెట్టు ఎక్కి వారిలో కొందరు అదనపు ఎస్పీ స్థాయికి ఎదిగారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరంతా 37 ఏళ్ల తర్వాత తిరిగి ఒకచోటకు చేరారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం వీరి ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో ఆడిపాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎస్‌ఐ ఉద్యోగాలకు పోలీసు శాఖ ప్రకటన ఇచ్చింది. 400 మంది ఎస్‌ఐలుగా ఎంపికయ్యారు. అప్పటికి అప్పా(ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ) ఏర్పాటు కాలేదు. దీంతో 200 మంది హైదరాబాద్ అంబర్‌పేటలో ఉన్న సీపీఎల్(సెంట్రల్ పోలీసు లైన్)లో, మరో 200 మంది అనంతపురంలో శిక్షణ పొందారు. 1989 జనవరి 16వ తేదీన వీరంతా ఎస్‌ఐలుగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. వీరిలో చాలామంది అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది ఉద్యోగ విరమణ చేశారు. నలుగురు మాత్రం ఐపీఎస్ పదోన్నతిని అందుకున్నారు. వైజాగ్ రేంజ్‌లో ఉన్న రవిప్రకాశ్, నంద్యాల ఎస్పీగా పనిచేసిన రఘువీర్‌రెడ్డి, తెలంగాణలో ఉన్న నాగరాజు, రాజేంద్రప్రసాద్ ఎస్పీలుగా పనిచేశారు. వారిలో నాగరాజు ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఆత్మీయ కలయికకు మొత్తం 170 మంది వరకు హాజరయ్యారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ, ఎన్.మురళీకృష్ణ, గుంటూరు అదనపు ఎస్పీ(అడ్మిన్) రమణమూర్తి, పల్నాడు అదనపు ఎస్పీ(క్రైమ్స్) లక్ష్మీపతితోపాటు విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసినవారు ఎక్కువగా హాజరయ్యారు. శిక్షణలో నాటి అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.