Share News

పశువుల తరలింపులో అమానుషం

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:55 AM

ఐదు పశువులకు మించి పట్టని వాహనంలో 18 పశువులను కుక్కేశారు. తల అటూఇటూ తిప్పే వీలు కూడా లేకుండా వాటిని కట్టేశారు.

పశువుల తరలింపులో అమానుషం

  • మినీ వ్యాన్‌లో 18 జీవాలను కుక్కి రవాణా

  • ఊపిరాడక మూడు మూగజీవాలు మృతి

ఇచ్ఛాపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఐదు పశువులకు మించి పట్టని వాహనంలో 18 పశువులను కుక్కేశారు. తల అటూఇటూ తిప్పే వీలు కూడా లేకుండా వాటిని కట్టేశారు. నీరు, గడ్డి కూడా అందుబాటులో లేకుండా చేశారు. ఇలా పశువులకు నరకం చూపిస్తూ వాటిని తరలిస్తున్నారు. మొత్తం మూడు వాహనాలు, ఒక్కోదానిలో 18 పశువులను తరలిస్తున్నారు. ఒడిశా నుంచి ఇచ్ఛాపురం వస్తున్న ఈ వాహనాలను చూసిన ఒడిశాలోని పితాతొళి గ్రామస్థులకు అనుమానం వచ్చి ఆపాలని ప్రయత్నించారు. అయితే, వాహనదారులు వాటిని ఆపకుండా గ్రామస్థులపైకి దూకించి తప్పించుకుపోవాలని ప్రయత్నించారు. ఇలా రెండు వాహనాలు గ్రామస్థుల నుంచి తప్పించుకున్నాయి. అయితే, మూడో వాహనాన్ని వాసంతి అనే మహిళ, గ్రామస్థులు వెంబడించారు. ఇచ్ఛాపురం సమీపంలోని పురుషోత్తపురం వద్ద రైల్వేట్రాక్‌ పక్కనే ఒక మట్టి రోడ్డు ఉంది. అక్కడికి వచ్చాక ఆ మూడో వాహనం గోతిలో దిగబడడంతో నిలిచిపోయింది. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు వెంటనే పారిపోయారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పశువులను అతి కష్టమ్మీద బయటకు తీశారు. అప్పటికే అందులో మూడు పశువులు చనిపోయి ఉన్నాయి. ఇచ్ఛాపురం పట్టణంలోనే ఓ వ్యాపారి ఒడిశాలో వీటిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్టు సమాచారం.

Updated Date - Jan 21 , 2026 | 04:42 AM