అటెండర్‌కు జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:27 AM
కారుణ్య నియామకం కింద అటెండర్ ఉద్యోగం పొందిన ఓ వ్యక్తి... తన విద్యార్హతలకు అనుగుణంగా ఉన్నత పోస్టులో నియమించాలంటూ 17 ఏళ్లుగా చేస్తున్న న్యాయపోరాటం ఫలించింది.
విద్యార్హత ఉంటే ఆ పోస్టుకు అర్హులేనన్న హైకోర్టు
ఫలించిన 17ఏళ్ల న్యాయపోరాటం
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కారుణ్య నియామకం కింద అటెండర్ ఉద్యోగం పొందిన ఓ వ్యక్తి... తన విద్యార్హతలకు అనుగుణంగా ఉన్నత పోస్టులో నియమించాలంటూ 17 ఏళ్లుగా చేస్తున్న న్యాయపోరాటం ఫలించింది. అతని సర్వీసును క్రమబద్ధీకరించి జూనియర్ అసిస్టెంట్‌గా నియమించాలని హైకోర్టు ఆదేశించింది. కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యేందుకు విద్యార్హత ఉన్నా కడప జిల్లా జడ్జి పిటిషనర్ వినతిని తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. సంబంధిత ఉత్తర్వులను రద్దు చేసింది. 2011 మార్చి 22 నుంచి పిటిషనర్ శశికాంత్‌రెడ్డిని జూనియర్ అసిస్టెంట్‌గా పరిగణించి, తదనుగుణంగా పదోన్నతులు, టైమ్‌స్కేల్ వర్తింపచేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. కడప జిల్లాలోని ఓ కోర్టులో ఎగ్జామినర్‌గా పనిచేస్తూ 2004లో తండ్రి మరణించడంతో అదే ఏడాది డిసెంబరు 7న కారుణ్య నియమకం కింద శశికాంత్ రెడ్డి అటెండర్‌గా నియమితులయ్యారు. అయితే తనకు జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కావాల్సిన విద్యార్హతలు ఉన్నాయని, తనను ఆ పోస్టులో నియమించాలని కోరుతూ శశికాంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోకపోవడంతో 2009లో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం విచారణ జరిపి.. పిటిషనర్ వినతిపై నిర్ణయం తీసుకోవాలని కడప జిల్లా జడ్జిని ఆదేశించింది. ఈ వినతిని తిరస్కరిస్తూ 2011 మార్చి 22న జిల్లా జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ శశికాంత్‌రెడ్డి 2011లో మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఇనుగంటి అవనింజ వాదనలు వినిపించారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిటిషనర్ అభ్యర్థనను కడప జిల్లా జడ్జి తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యేందుకు పిటిషనర్‌కు విద్యార్హతలు ఉన్నాయని, పేర్కొంది. 2011 మార్చి 22 నుంచి పిటిషనర్‌ను జూనియర్ అసిస్టెంట్‌గా పరిగణించి, తదనుగుణంగా పదోన్నతులు, టైమ్‌స్కేల్ వర్తింపచేయాలని ఆదేశించింది. పిటిషనర్ అటెండర్‌గా పనిచేసి వేతనం పొందినందున వేతన బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.