Share News

తొలిరోజు 174 నామినేషన్లు

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:56 PM

పరిషత పోరుకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం బుధవారం ప్రారంభమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 174 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

తొలిరోజు 174 నామినేషన్లు

జడ్పీటీసీ 9, ఎంపీటీసీ 165

కృష్ణగిరి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా కేఈ రుద్రఫణి నామినేషన దాఖలు

అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు బీజీ

కర్నూలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పరిషత పోరుకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం బుధవారం ప్రారంభమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా తొలిరోజు 174 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 26 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ) స్థానాలకు కర్నూలు జడ్పీ కార్యాలయంలో ఆర్‌వో నామినేషన్లు స్వీకరించారు. 432 మండల పరిషత ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) స్థానాలకు ఆయా మండల పరిషత్తు కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నోటిఫికేషన జారీ చేసి నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. జడ్పీ చైర్మన పీఠం ఆశిస్తున్న మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ కుమారుడు కేఈ రుద్రఫణి గౌడ్‌ కృష్ణగిరి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన దాఖలు చేశారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలసి వచ్చి నామినేషన వేశారు. జడ్పీ చైర్మన రేసులో ఉన్న మరో టీడీపీ నాయకుడు గోతులదొడ్డి చుడి ఉలిగయ్య కౌతాళం జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన వేస్తే, ఆయన కుమారుడు చుడి సురేశనాయుడు కూడా టీడీపీ అభ్యర్థిగా మరో నామినేషన వేశారు. తండ్రీకొడుకులు కలసి వచ్చారు. ఓర్వకల్లు జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి చెట్ల దానమ్మ నామినేషన వేశారు. ఆదోని-2 జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థులు హెచ.విజయలక్ష్మి, రత్నమ్మ, సి.బెళగల్‌ జడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థి సోమశేఖర్‌రెడ్డి, కల్లూరు జడ్పీటీసీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అనితా గ్యాంగి, మద్దికెర జడ్పీటీసీ స్థాసానికి సీపీఐ అభ్యర్థిగా ఎస్‌. మహబూబ్‌ బీలు నామినేషన వేశారు. 432 ఎంపీటీసీ స్థానాలకు 165 నామినేషన్లు వేశారు. అందులో టీడీపీ అభ్యర్థులు 77, వైసీపీ అభ్యర్థులు 73, జనసేన అభ్యర్థులు 7, ఇతర పార్టీలు, స్వతంత్రులుగా ఎనిమిది మంది నామినేషన్లు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు బిజీగా ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో పోటాపోటీగా నామినేషన్లు వేసేందుకు ఆయా పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈమేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Oct 21 , 2026 | 11:56 PM