17 రాష్ట్రాల్లో ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులు
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:09 AM
పదికన్నా ఎక్కువ ఉగ్ర కేసుల విచారణ పెండింగ్‌లో ఉన్న 17 రాష్ట్రాల్లో కనీసం ఒక ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది.
సుప్రీం కోర్టుకు తెలియజేసిన కేంద్రం
రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: పదికన్నా ఎక్కువ ఉగ్ర కేసుల విచారణ పెండింగ్‌లో ఉన్న 17 రాష్ట్రాల్లో కనీసం ఒక ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టును ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈమేరకు సుప్రీంకు తెలియజేసింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు వేరేగా కోర్టు కాంప్లెక్స్‌లను నిర్మించకుండా ఇప్పటికే ఉన్న కోర్టును రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవచ్చని సూచిస్తూ కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు లేఖ రాసినట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనానికి అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలియజేశారు. ఈ కోర్టులకు రికరింగ్, నాన్ రికరింగ్ వ్యయాల నిమిత్తం రూ.కోటి చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా అనేక దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నందున ఎన్‌ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ముఖ్యమని సీజేఐ పేర్కొన్నారు. నేరాలు తీవ్రంగా ఉన్నప్పటికీ విచారణ లేకుండా నిందితులను కస్టడీలో ఉంచలేమన్నారు. ప్రస్తుత కోర్టులకు ఎన్‌ఐఏ విచారణలను అప్పగించడంలో ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. కాగా ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులకు సంబంధించి స్పందన తెలియజేయాలని ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.