Share News

ఆ కుటుంబానికి ‘17 కోట్ల’ కష్టం!

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:09 AM

మూడేళ్ల తమ పసిబిడ్డకు సోకిన అరుదైన వ్యాధితో ఆ కుటుంబానికి ‘కోట్ల’ కష్టం వచ్చి పడింది. ఆ వ్యాధి నయం కావాలంటే చికిత్స భాగంలో రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ వేయాలని వైద్యులు చెప్పడంతో...

ఆ కుటుంబానికి ‘17 కోట్ల’ కష్టం!

  • మూడేళ్ల బాలుడికి అరుదైన ‘ఎస్‌ఎంఏ’ వ్యాధి

  • దాతల సాయం కోసం తల్లిదండ్రుల వినతి

లేపాక్షి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మూడేళ్ల తమ పసిబిడ్డకు సోకిన అరుదైన వ్యాధితో ఆ కుటుంబానికి ‘కోట్ల’ కష్టం వచ్చి పడింది. ఆ వ్యాధి నయం కావాలంటే చికిత్స భాగంలో రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్‌ వేయాలని వైద్యులు చెప్పడంతో ఆ పేద తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అంత డబ్బులు వెచ్చించడం తమ వల్ల కాదని.. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు. తమ కుమారుడికి పునర్జన్మనివ్వాలని వేడుకుంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రానికి చెందిన నటరాజ్‌, శైలజ దంపతుల మూడేళ్ల కుమారుడు ఎన్‌.కేయాన్ష్‌ అద్విక్‌ అరుదైన ‘స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ టైప్‌-2’ (ఎస్‌ఎంఏ టైప్‌-2) సమస్యతో బాధపడుతున్నాడు. ఇదొక జన్యుపరమైన లోపం కారణంగా వచ్చే వ్యాధి. దీని కారణంగా కండరాలు బలహీనం కావడం, సొంతంగా నడవలేకపోవడం వంటివి జరుగుతాయి. ఏడాది క్రితం వరకూ అద్విక్‌ ఆరోగ్యంగానే ఉండేవాడు. ఆ తర్వాత కాళ్లు చచ్చుబడ్డాయి. శరీరం బలహీనంగా తయారైంది. దీంతో తల్లిదండ్రులు హిందూపురం, బత్తలపల్లి, పుట్టపర్తి ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. పుట్టపర్తి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలుడు బెంగళూరు బాప్టిస్ట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడి వైద్యులు అద్విక్‌ను పరీక్షించి, ఎస్‌ఎంఏ టైప్‌-2 వ్యాధి సోకిందని నిర్ధారించారు. చికిత్సలో భాగంగా రూ.17 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్‌ ఇవ్వాలని సూచించారు.


ఆ ఇంజెక్షన్‌ వేస్తే తప్ప చిన్నారి దక్కే అవకాశం లేదని తేల్చారు. దీంతో ఆ తల్లీదండ్రులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. నటరాజ్‌, శైలజ దంపతులది వ్యవసాయ కుటుంబం. నటరాజ్‌ బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగి. శైలజ గృహిణి. అంత ఖరీదైన ఇంజెక్షన్‌ చేయించడం తమ వల్ల కాదని, దాతలు, ప్రభుత్వం ఆదుకోవాలని వారు విన్నవిస్తున్నారు.

దాతలు సాయం చేయాలనుకుంటే..

తల్లి పేరు: ఎం.శైలజ

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హిందూపురం

ఖాతా నంబరు: 32029137877

ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌: ఎస్‌బీఐఎన్‌0000845

తండ్రి నటరాజ్‌ ఫోన్‌ పే: 7795576806

Updated Date - Mar 10 , 2026 | 04:10 AM