పశువుల షెడ్డులిచ్చారు.. బిల్లులేవీ?
ABN , Publish Date - Mar 28 , 2026 | 05:07 AM
ఉపాధి హామీ పథకంలో భాగంగా పశు పోషకుల వ్యక్తిగత ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వం పశువుల షెడ్ల(మినీ గోకులాలు)ను నిర్మిస్తోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం తొలి ఏడాదిలో 30 వేల షెడ్లు నిర్మించారు.
15 వేల మినీ గోకులాలకు చెల్లింపులు నిల్
ఉపాధి స్థానంలో జీరామ్‌జీ రాకతో ఇబ్బంది
పోర్టల్‌లో అప్‌లోడ్ కాని గోకులాల బిల్లులు
రూ.300 కోట్ల వరకు చెల్లించాల్సిన కేంద్రం
స్పందించకపోతే.. ఆ భారం రాష్ట్రంపైనే
నిధుల కోసం పశుపోషకుల ఎదురుచూపులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉపాధి హామీ పథకంలో భాగంగా పశు పోషకుల వ్యక్తిగత ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వం పశువుల షెడ్ల(మినీ గోకులాలు)ను నిర్మిస్తోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం తొలి ఏడాదిలో 30 వేల షెడ్లు నిర్మించారు. ఈ నిర్మాణాలు, నిధుల చెల్లింపు వంటివి సజావుగానే సాగిపోయాయి. అయితే, రెండో ఏట ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్మించ తలపెట్టిన మినీ గోకులాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో జీరామ్‌జీ పథకాన్ని తెచ్చే నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ దేశవ్యాప్తంగా గ్రామాల్లో చేపట్టే పనులను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రతిగ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న పనులు 20కి మించరాదని నిబంధన పెట్టింది. దీంతో గ్రామాల్లో 20 పనులు కొనసాగుతుంటే కొత్త పనులు ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా మంజూరైనప్పటికీ కొత్త పనులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి మెటీరియల్ నిధులతో చేపట్టే పనులకు బ్రేక్ పడి, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రస్తుత పనులను నిలిపివేశారు. వ్యక్తిగత పనులకు సంబంధించి హౌసింగ్, ఉద్యానవన పంటల అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఉన్నా కొనసాగిస్తున్నారు. అయితే, మినీ గోకులాలను కొత్తగా నిర్మించేందుకు అనుమతించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 34 వేల దాకా మినీ గోకులాలు మంజూరయ్యాయి. వీటిలో సుమారు 15 వేల మినీ గోకులాలు ప్రస్తుతం జరుగుతున్న పనుల కింద చేర్చకపోవడంతో ఎన్‌ఐసీ పోర్టల్‌లో ఆ పనులకు బిల్లులు అప్‌లోడ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి హౌసింగ్, ఉద్యానవన పంటల అభివృద్ధికి మాత్రమే అనుమతించింది.
15 వేల మంది ఎదురుచూపులు
పశువుల షెడ్లు మంజూరు చేయించుకున్న 15 వేల మంది పశుపోషకులు షెడ్ల నిర్మాణాలు చేసుకుని ఉపాధి పథకం ఎన్‌ఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలించలేదు. ఎన్‌ఐసీ పోర్టల్‌లో ‘పశువుల షెడ్లు’ అనే ఆప్షన్‌ను తీసుకోకపోవడంతో కొంత మంది రైతులు మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు లేఖ రాశారు. దీనిపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించిన మధ్యంతర సమీక్షలో రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమస్యను మరోసారి కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చేసిన పనులను ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31లోపు అప్‌లోడ్ చేయాలి. నెలాఖరుకు మరో మూడు రోజులే ఉండటంతో కేంద్రం నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందని పశుపోషకులు ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే, ఉపాఽధి పథకం మరో నెల పొడిగించడంతో కేంద్ర ప్రభుత్వం ఇకనైనా అవకాశమిస్తే ఏప్రిల్ నెలాఖరులోపు అప్‌లోడ్ చేసుకునే అవకాశముంటుందని భావిస్తున్నారు. లేకపోతే ఈ నిధుల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది.
అనుమతించకపోతే రాష్ట్రంపై భారం
మినీ గోకులాలను ఎన్‌ఐసీ పోర్టల్ ద్వారా అప్‌లోడ్ చేసుకునేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఏప్రిల్‌లో కూడా అనుమతించకపోతే రాష్ట్ర వ్యాప్తం గా పూర్తిచేసిన 15 వేల పశువుల షెడ్లకు సంబంధించిన సుమారు రూ.300 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడనుంది. ఉపాధి పథకం ద్వారా చేపట్టే పనులన్నింటినీ కలెక్టర్లు మంజూరుచేస్తారు. ఈ పనులకు అయ్యే నిధులను కేంద్రం చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయినా జోక్యం చేసుకుని ఎన్‌ఐసీ పోర్టల్‌లో మినీ గోకులాల బిల్లులు అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని పశుపోషకులు కోరుతున్నారు.