ఒకటికి రెండు.. విజయపథంలో ‘గ్రూప్’ వీరులు
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:27 AM
ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల..! దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడి చదువుతారు..! అలా కష్టపడిన వారిలో కొందరికి ఉద్యోగాల పంట పండింది.! పలువురు అభ్యర్థులు అటు గ్రూప్-2 ఇటు గ్రూప్-1 రెండిట్లోనూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
15 మందికి గ్రూప్ 1,2 రెండిటిలోనూ కొలువులు
గ్రూప్-2 వదిలేసి గ్రూప్-1 పోస్టులో చేరే యోచన
ఖాళీ పోస్టులు మెరిట్ అభ్యర్థులకు ఇవ్వాలనే విజ్ఞప్తులు
కొద్ది మందికి తెలంగాణ, ఏపీల్లోనూ కొలువులు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ ఉద్యోగం చాలా మంది కల..! దీనికోసం ఏళ్ల తరబడి కష్టపడి చదువుతారు..! అలా కష్టపడిన వారిలో కొందరికి ఉద్యోగాల పంట పండింది.! పలువురు అభ్యర్థులు అటు గ్రూప్-2 ఇటు గ్రూప్-1 రెండిట్లోనూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వం ఉద్యోగం వస్తే చాలు.. అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏ ఉద్యోగం కావాలో ఎంపిక చేసుకునే స్థాయికి చేరుకున్నారు. కాగా.. వారిలో కొందరు ఇప్పటికే ఇతరత్రా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. కొద్ది మంది అభ్యర్థులైతే ఇటీవల విడుదలైన తెలంగాణ ఫలితాల్లో ఉద్యోగాలు సాధించి.. ఇప్పుడు ఏపీలోనూ కొలువులకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1, గ్రూప్-2 రెండు నోటిఫికేషన్లలోనూ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు 15 మంది ఉన్నారు. గత వారం గ్రూప్-1 ఫలితాలు విడుదల కాగా, అంతకముందు గ్రూప్-2 ఫలితాలు వచ్చాయి. రోజుల వ్యవధిలోనే రెండు నోటిఫికేషన్ల ఫలితాలు రావడంతో రెండిటికీ ఎంపికైన అభ్యర్థులు గ్రూప్-2 ఉద్యోగాలను వదిలేయనున్నారు. అలాగే రెండు రాష్ర్టాల్లోనూ ఉద్యోగాలు సాధించినవారిలో ఒకరిద్దరు తెలంగాణలోనే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. కాగా రెండిట్లో ఎంపికైన నేపథ్యంలో ఖాళీ అయ్యే గ్రూప్-2 ఉద్యోగాలను తర్వాత మెరిట్ అభ్యర్థులకు ఇవ్వాలని సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు కోరుతున్నారు. దానివల్ల పోస్టులను క్యారీ ఫార్వార్డ్ చేసే అవసరం ఉండదని, అలాగే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.
రెండు నోటిఫికేషన్లలో ఎంపిక
ఓ అభ్యర్థికి గ్రూప్-2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. ఆ వెంటనే గ్రూప్-1 ఫలితాల్లో ఆర్టీవో ఉద్యోగం సాధించారు. మరో అభ్యర్థి గ్రూప్-2లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎంపికవగా, గ్రూప్-1లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఉద్యోగం వచ్చింది. ఓ అభ్యర్థికి గ్రూప్-2లో సబ్ రిజిస్ర్టార్, గ్రూప్-1లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చాయి. కాగా.. వ్యక్తిగత కారణాలతో ఆయన గ్రూప్-2 ఉద్యోగంలోనే చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. మరో అభ్యర్థికి గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దారు ఉద్యోగం, గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చాయి. ఇంకో అభ్యర్థికి గ్రూప్-లో జూనియర్ అసిస్టెంట్ వస్తే, గ్రూప్-1లో డిప్యూటీ రిజిస్ర్టార్ వచ్చింది. మరో అభ్యర్థికి గ్రూప్-2లో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్-1లో ఏసీటీవో ఉద్యోగాలొచ్చాయి. ఇలా 15 మందికి రెండు నోటిఫికేషన్లలోనూ ఉద్యోగాలొచ్చాయి. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ గ్రూప్-2 ఉద్యోగాలను వదిలేయనున్నారు. మరోవైపు సుదర్శన్ అనే అభ్యర్థి ఇటీవల విడుదలైన తెలంగాణ గ్రూప్-1లో డీఎస్పీ ఉద్యోగం సాధించగా, ఇప్పుడు ఏపీ గ్రూప్-1లోనూ ఉద్యోగం సాధించారు. లక్ష్మీ దీపిక అనే అభ్యర్థికి రెండు రాష్ర్టాల్లోనూ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలు వచ్చాయి. ఏపీలో గ్రూప్-1లో సంక్షేమ శాఖలో ఉద్యోగం సాధించిన ఓ అభ్యర్థి ఆ ఉద్యోగంలో చేరేందుకు విముఖంగా ఉన్నట్లు తెలిసింది.
ఏపీపీఎస్సీ ఇదే చెప్పింది
తొలుత గ్రూప్-2 ఫలితాలు ఇస్తే గ్రూప్-1 ఫలితాల అనంతరం పలు పోస్టులు ఖాళీ అవుతాయని ఏపీపీఎస్సీ ముందే అభిప్రాయపడింది. అందుకే గ్రూప్-2 ఫలితాలు ఇవ్వాలని అభ్యర్థులు పదే పదే కోరినా కొంత ఆలస్యం చేస్తూ వచ్చింది. చివరికి గ్రూప్-1 కేసు ఎంతకీ తేలకపోవడం, గ్రూప్-2 ఫలితాల కోసం ఒత్తిడి పెరగడంతో తొలుత ఆ ఫలితాలు ఇచ్చింది. అయితే రెండు నోటిఫికేషన్ల ఫలితాల మధ్య సమయం చాలా తక్కువగా ఉన్నందున గ్రూప్-1 ఫలితాలు ముందుగా ఇచ్చినా పెద్దగా మార్పులేం ఉండేవి కావు. గ్రూప్-1కు ఎంపికైనవారు గ్రూప్-2 ఉద్యోగాల్లో చేరకుండానే వదిలేసే పరిస్థితి వచ్చినందున ఆ పోస్టులను తర్వాత మెరిట్ అభ్యర్థులకు కేటాయించాలని సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికై చివరి దశలో ఉద్యోగాలు రాని అభ్యర్థులు కోరుతున్నారు. 2016కు ముందు ఇలా తర్వాత మెరిట్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించే విధానం ఉండేది. చాలాకాలం నుంచి మిగిలిపోయిన పోస్టులను క్యారీ ఫార్వార్డ్ చేసి తర్వాత నోటిఫికేషన్లలో గుర్తిస్తున్నారు. అయితే రెండు నోటిఫికేషన్ల ఫలితాలు రోజుల వ్యవధిలోనే రావడం వల్ల గ్రూప్-2 ఉద్యోగాల్లో అభ్యర్థులు చేరనందున తర్వాత వారికి అవకాశం ఇస్తే వారికి మేలు జరుగుతుందని అభ్యర్థులు అంటున్నారు.