రాష్ట్రానికి రూ.1414 కోట్ల ‘జీరామ్‌జీ’ నిధులు
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:02 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. వీబీజీరామ్‌జీ కింద 2026-27కి తొలివిడతగా రూ.1414.16 కోట్లు మంజూరు.
తొలివిడతగా విడుదల చేసిన కేంద్రం
అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి శ్రామికులకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. వీబీజీరామ్‌జీ కింద 2026-27కి తొలివిడతగా రూ.1414.16 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు వినియోగించనున్నారు. ఇందులో ఎస్సీ వర్గాలకురూ.241.54 కోట్లు, ఎస్టీలకు రూ.78.21 కోట్లు, ఇతర వర్గాలకు రూ.1094 కోట్లు కేటాయించారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు అనుగుణంగా (కేంద్రం వాటా 60శాతం)రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 40 శాతం సుమారు రూ.940 కోట్లు జమచేయాల్సి ఉంటుంది. పనులకు సంబంధించి అన్ని వ్యయాలు వీబీజీరామ్‌జీ సాఫ్ట్‌వేర్, పీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు కావాలని, శ్రామికులకు ఎలాంటి డబుల్ చెల్లింపులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తేనే శ్రామికుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తారు.