నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం!
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:01 AM
కనీస డ్రైవింగ్ పరిజ్ఞానం లేని క్లీనర్‌తో ప్రైవేటు ట్రావెల్ బస్సును నడిపించి 14మంది ప్రయాణికులను అగ్నికి ఆహుతి చేసిన హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డి...
లైసెన్స్ లేని డ్రైవర్‌ను పెట్టి 14 మంది ప్రాణాలు తీశాడు
మార్కాపురం ఘటనలో ఇద్దరి అరెస్ట్: డీఎస్పీ
మార్కాపురం టౌన్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): కనీస డ్రైవింగ్ పరిజ్ఞానం లేని క్లీనర్‌తో ప్రైవేటు ట్రావెల్ బస్సును నడిపించి 14మంది ప్రయాణికులను అగ్నికి ఆహుతి చేసిన హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డి, డ్రైవర్ పందెం యువరాజును అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జర్రావారిపాలేనికి చెందిన పాపన హరికృష్ణారెడ్డి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు డ్రైవర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలో సెకండ్ హ్యాండ్ బస్సులను కొని కలిగిరి నుంచి తెలంగాణలోని హైదరాబాద్, జగిత్యాల, బెంగళూరులకు నడుపుతున్నాడు. 8 నెలల క్రితం హైదరాబాద్‌లో ఏఆర్ 20డీ 0487 బస్సు కొని, కలిగిరి నుంచి నిర్మల్, జగిత్యాల వరకు నడుపుతున్నారు. సుమారు రెండేళ్లుగా హరికృష్ణ ట్రావెల్స్ బస్సులకు క్లీనర్‌గా పామూరుకి చెందిన యువరాజు పనిచేస్తున్నాడు. ఎలాంటి లైసెన్స్ లేకపోయినా, తక్కువ జీతానికి వచ్చాడని.. కొన్నాళ్లుగా కలిగిరి-జగిత్యాల బస్సుకు అతడిని డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. మార్చి 25న ప్రమాదం జరిగినరోజు జగిత్యాల నుంచి ఆ బస్సును యువరాజు నడిపాడు. పలుచోట్ల ఆ బస్సు ఇంజన్ మూడుసార్లు సెన్సార్ సమస్యతో ఆగిపోయింది. విషయాన్ని యజమాని హరికృష్ణారెడ్డికి తెలియజేయగా, ఫోన్‌లో సూచనలిస్తూ యువరాజుతో బస్సును గమ్యంవైపు తీసుకెళ్తున్నాడు. చివర్లో వేకువజాము 3 గంటల సమయంలో ఎర్రగొండపాలెంలో మళ్లీ బస్సు ఆగిపోయింది. గంటసేపయినా స్టార్ట్ కాకపోవడంతో ప్రయాణికులు డ్రైవర్‌ను నిలదీశారు. మళ్లీ యజమానితో మాట్లాడి ఎలాగోలా బస్సును స్టార్ట్ చేసిన డ్రైవర్ యువరాజు మార్కాపురం వరకు చేర్చాడు. అక్కడ యజమాని హరికృష్ణారెడ్డి కూడా బస్సులోకి ఎక్కాడు. వీలైనంత త్వరగా కలిగిరి వెళ్లాలని డ్రైవర్‌పై ఒత్తిడి తెచ్చాడు. ఈక్రమంలోనే అతివేగంగా వెళ్తూ మండలంలోని రాయవరం పలకల గనుల వద్ద పెద్దమలుపులో స్టీరింగ్ పట్టేయడంతో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను బస్సు ఢీకొట్టింది. టిప్పర్ డీజిల్ ట్యాంకు పగిలి డీజిల్ బస్సుపై పడి మంటలు అంటుకున్నాయి. ఈ కేసులో బస్సు యజమాని హరికృష్ణారెడ్డితోపాటు, డ్రైవర్‌ను బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు.