Share News

పదమూడేళ్లు వచ్చినా.. పసిబిడ్డే!

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:14 AM

అమ్మ ఒడిలో ఉన్న ఈ బాలికను చూశారా!! చూడ్డానికి రెండేళ్ల వయసు చిన్నారిలా కనిపిస్తోంది కదూ! అయితే, మీరు పొరపడ్డట్టే!! ఆ బాలిక వయసు అచ్చంగా 13 ఏళ్లు.

పదమూడేళ్లు వచ్చినా.. పసిబిడ్డే!

  • శారీరక, మానసిక ఎదుగుదలలేని బాలిక

  • వైద్యం చేయించలేని దీనస్థితిలో తల్లిదండ్రులు

  • కనీసం పింఛనైనా ఇప్పించాలని వేడుకోలు

కలువాయి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): అమ్మ ఒడిలో ఉన్న ఈ బాలికను చూశారా!! చూడ్డానికి రెండేళ్ల వయసు చిన్నారిలా కనిపిస్తోంది కదూ! అయితే, మీరు పొరపడ్డట్టే!! ఆ బాలిక వయసు అచ్చంగా 13 ఏళ్లు. పుట్టినప్పటినుంచే సరైన శారీరక, మానసిక ఎదుగుదల లేదు. కూర్చోలేదు.. నిలబడలేదు.. ఎప్పుడూ తల్లి ఒడిలో ఉండాల్సిందే. మాటలు రావు. సమయానికి అన్నం పెడితే తింటుంది. లేదంటే అంతే! ఇదీ.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన కలువాయికి చెందిన బాలిక కీర్తన దీనగాథ. కలువాయిలోని గిరిజన కాలనీకి చెందిన గంటా వాసుదేవకుమార్‌, కృష్ణవేణి దంపతులు దినసరి కూలీలు. వీరికి స్వప్న, కీర్తన, అర్చన, నందన అనే నలుగురు ఆడపిల్లలు. రెండో కుమార్తె కీర్తనకు 13 ఏళ్ల వయస్సు. పుట్టినప్పటి నుంచే ఆ చిన్నారికి శారీరక, మానసిక ఎదుగుదల లేకపోవడంతో ఇప్పటికీ ఏడాది రెండేళ్ల చిన్నారిలా ఉంటుంది. కీర్తన పుట్టినప్పుడు బరువు కేవలం 750 గ్రాములు ఉందని, ఆ తర్వాత ఎదుగుదల లేదని ఆమె తల్లి కృష్ణవేణి కన్నీరు పెట్టుకుంది. వైద్యం చేయించేందుకు ఆర్థికస్తోమత సరిపోకపోవడంతో కుమార్తెను ఇంటివద్దే ఉంచుకున్నారు. కూలి పనులకు వెళ్లే దంపతులు.. కీర్తన ఆలనాపాలనా చూసుకునేందుకు ఏడో తరగతి చదువుతున్న మొదటి కుమార్తె స్వప్నను మూడేళ్ల క్రితం చదువు మాన్పించారు. స్వప్నకు చదువంటే ఎంతో ఇష్టమని ఇప్పుడు కూడా ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉండేందుకు ఇల్లు కూడా లేని ఆ కుటుంబం అద్దె ఇంటిలో ఉంటోంది.


కీర్తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు తమ బాధ వర్ణనాతీతంగా ఉందని, వైద్యులు పాపకు చికిత్స చేయాలన్నా భయపడుతున్నారని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సదరన్‌ క్యాంప్‌లో కీర్తనకు 90శాతం వికలత్వం ఉన్నట్లు సర్టిఫికెట్‌ ఇచ్చినా పింఛను మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కలువాయికి వచ్చిన కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు కూడా తమ పరిస్థితి చెప్పుకుని పింఛను మంజూరు చేయాలని వేడుకున్నా, ఫలితం లేకపోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైకల్యంతో బాధపడుతున్న చిన్నారి పోషణకు పింఛనుతోపాటు అవసరమైన వైద్యసాయం అందేలా చూడాలని వారు వేడుకుంటున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 04:14 AM