Share News

‘ఉన్నతి’ సొమ్ము ఊడ్చేశారు!

ABN , Publish Date - Mar 22 , 2026 | 03:42 AM

వెలుగు పథకంలో ఎస్టీ, ఎస్టీ మహిళలకు చెందాల్సిన నిధులు ఏమయ్యాయో అంతుపట్టడం లేదు. దళిత, గిరిజన, వాటర్‌షెడ్‌ ప్రాంతాల్లోని పేద మహిళలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేటాయించిన ఈ సొమ్ము మాయమైంది.

‘ఉన్నతి’ సొమ్ము ఊడ్చేశారు!

  • వెలుగు మండల సమాఖ్యల మాయాజాలం

  • లెక్క తేలని మండలాల నిధులు

  • పేద ఎస్సీ, ఎస్టీ మహిళల సొమ్ము రూ.130 కోట్లు పక్కదారి

  • ‘సెర్ప్‌’ సిబ్బంది, స్థానిక నేతలు స్వాహా!

  • విచారణ జరిగితేనే దొంగలెక్కలు వెలుగులోకి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వెలుగు పథకంలో ఎస్టీ, ఎస్టీ మహిళలకు చెందాల్సిన నిధులు ఏమయ్యాయో అంతుపట్టడం లేదు. దళిత, గిరిజన, వాటర్‌షెడ్‌ ప్రాంతాల్లోని పేద మహిళలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేటాయించిన ఈ సొమ్ము మాయమైంది. సీఐఎఫ్‌, పీవోపీ నిధులను రాజకీయ నాయకుల సమావేశాలకు ధారాదత్తం చేసినట్లుగా.. ‘ఉన్నతి’ నిధులు కూడా చోటా మోటా నేతలకు కట్టబెట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆటీవల కొన్ని జిల్లాల్లో డ్వాక్రా సంఘాల మధ్య జరిగిన గొడవల్లో ఉన్నతి నిధుల గల్లంతు విషయం బయటపడింది. పలు జిల్లాల్లో ఈ నిధులు రూ.130 కోట్ల వరకు దారితప్పినట్లు తెలుస్తోంది.


వడ్డీ లేకుండా రుణాలు..

గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) ఆవిర్భవించి పదేళ్లయిన సందర్భంగా 2009లో అప్పటి ఉమ్మడిరాష్ట్ర ప్రభుత్వం.. ఇంకా అభివృద్ధి చెందని దళిత, గిరిజన మహిళా సంఘాలకు చెందిన మహిళల స్వయం సమృద్ధి కోసం ‘ఉన్నతి’ పథకాన్ని తీసుకొచ్చింది. 2011 వరకు ఈ నిధులతో పేద ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలు అందించి వారికి స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు ఒక్కో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉండే 6 నుంచి 10 మండలాలను ఎంపిక చేశారు. వీటిని అప్పట్లో ‘ఉన్నతి’ మండలాలుగా గుర్తించారు. వీటి కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కోఆర్డినేటర్లను, ఏపీడీలను కూడా నియమించారు. ‘ఉన్నతి’ పథకం కింద ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు కేటాయించారు. ఆయా మండలాల్లో ఒక్కోదానికి రూ.60 లక్షల నుంచి రూ.కోటిన్నర దాకా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 13 జిల్లాల్లో సుమారు రూ.130 కోట్ల వరకు విడుదలయ్యాయి. ఈ నిధులను గ్రామ సమాఖ్యలోను, మండల సమాఖ్యలోను ఉంచి సదరు డ్వాక్రా సంఘాలకు ఆర్థిక పరపతి అందించాలి. ఆ మండలాల్లో ఎస్సీ, ఎస్టీ డ్వాక్రా సంఘాలకు, వాటర్‌షెడ్‌ ప్రాంతాల్లో పేద మహిళా సంఘాలకు రుణాలు అందించి స్వయం ఉపాధి యూనిట్లు అభివృద్ధి చేశారు. ఎస్సీ, ఎస్టీలకు వడ్డీ లేకుండా ఈ రుణాలందించారు. ఈ రుణాలను తాము చెల్లించామని సదరు డ్వాక్రా సంఘాలు చెబుతున్నాయి. కానీ ఆ నిధులు గ్రామ సమాఖ్యల్లోనూ లేవు.. ప్రభుత్వం వద్దా లేవు. ఏమయ్యాయో పట్టించుకునే అధికారీ లేరు. వీటిని వెలుగు సిబ్బందితో పాటు స్థానిక నేతలు కాజేసినట్లు తెలుస్తోంది. సెర్ప్‌కు వివిధ సందర్భాల్లో ఆయా పథకాల కింద కేటాయించిన నిధులు ఆయా గ్రామ, మండల సమాఖ్యల్లోనే ఉన్నాయని లెక్కలు రాసుకుంటున్నా.. నిజానికి అక్కడ లేవంటున్నారు. ఆయా జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లుగా వచ్చిన అధికారులు కూడా ఆ నిధుల ఊసెత్తడం లేదు.


మహిళా సంఘాలను శక్తిమంతం చేసేందుకు నిధులు...

రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలంటే అది మహిళల వల్లనే సాధ్యమని ఆనాడే ఎన్టీఆర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహించారు. ‘వెలుగు’ కార్యక్రమాన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమంగా మార్చేశారు. డ్వాక్రా సంఘాలను శక్తిమంతమైన వ్యవస్థలుగా చేయడానికి అప్పట్లోనే భారీగా నిధులు కేటాయించారు. చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాలకు పెట్టుబడుల కోసం కమ్యూనిటీ ఇన్వెస్ట్‌ ఫండ్‌(సీఐఎఫ్‌) ఇవ్వగా.. ఆ తర్వాతి ప్రభుత్వాలు కూడా ‘అత్యంత నిరుపేదలు (పీవోపీ)’, ‘మోడల్‌ మండలాలు’ పేర్లతో నిధులు విడుదల చేశాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) నిధులు సైతం భారీగా వెలుగు కార్యక్రమాలకు చేదోడుగా నిలిచాయి. దీంతో పాటు మానవాభివృద్ధి కింద గర్భిణులకు చేదోడుగా నిలిచేందుకూ నిధులు విడుదల చేశారు. అయితే డ్వాక్రా సంఘాల వద్ద ఉండాల్సిన ఈ నిధులను చాపకింద నీరులా కొంత మంది ‘సెర్ప్‌’ సిబ్బంది కొద్ది కొద్దిగా కరగదీశారు. మండల సమాఖ్యలు సైతం నిధులు దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఎవరికి అందినకాడికి వారు ఈ నిధులను అప్పనంగా డ్రా చేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిధులపై విచారణ జరిపితే అవినీతిపరులను వెలుగులోకి తీసుకురావొచ్చన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని ఉన్నతి నిధుల గల్లంతుపై సమగ్ర విచారణ జరపాలని డ్వాక్రా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - Mar 22 , 2026 | 03:47 AM