Share News

కొత్తగా 13 డయాలసిస్‌ కేంద్రాలు

ABN , Publish Date - Jan 25 , 2026 | 04:10 AM

గ్రామీణ కిడ్నీ రోగులకు కష్టాలు తొలగించేలా రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

కొత్తగా 13 డయాలసిస్‌ కేంద్రాలు

  • సీతంపేట, ఎస్‌.కోట ఆస్పత్రుల్లో త్వరలో ప్రారంభం: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): గ్రామీణ కిడ్నీ రోగులకు కష్టాలు తొలగించేలా రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఇంతకుముందు ప్రకటించిన వాటితో పాటు కొత్తగా మంజూరైన ఐదింటితో కలిపి మొత్తం 13 సెంటర్లు సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో రాబోతున్నాయని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రధాన మంత్రి నేషనల్‌ డయాలసిస్‌ ప్రోగ్రామ్‌ (పీఎంఎన్‌డీఎస్‌) కింద తిరుపతి జిల్లా రైల్వేకోడూరు, ప్రకాశం జిల్లా కొండపి, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, కడప జిల్లా మైదుకూరు, ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలోని సీహెచ్‌సీల్లో డయాలసిస్‌ కేంద్రాలు మంజూరైనట్లు వెల్లడించారు. ఇప్పటికే భీమవరం, పీలేరు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, జమ్మలమడుగులో కేంద్రాల ఏర్పాటు ప్రకియ్ర టెండర్‌ దశలో ఉన్నాయన్నారు. రెండు కేంద్రాలు గిరిజన ప్రాంతాలైన సీతంపేట, ఎస్‌.కోట ఆసుపత్రుల్లో సిద్ధమయ్యాయని, వీటిల్లో అతి త్వరలో సేవలు ప్రారంభం అవుతాయని, మిగిలిన కేంద్రాలు ఏప్రిల్‌ నాటికి సిద్ధం అవుతాయని తెలిపారు. ఒక్కొక్క కేంద్రంలో సుమారు రూ.85 లక్షల విలువ చేసే రక్తశుద్ధి యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. 13 కేంద్రాలకు కలిపి రూ.11.05 కోట్ల వరకూ వ్యయం చేస్తున్నామన్నారు. ఒక్కొక్క కేంద్రంలో ఐదు చొప్పున మిషన్లు ఉంటాయని, ప్రతి కేంద్రంలో రోజుకి మూడు సెషన్లలో రక్తశుద్ధి జరుగుతుందన్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ కింద కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్‌ సేవలు అందుతున్నాయన్నారు. 2024-25 లో కిడ్నీ బాధితుల కోసం రూ.164 కోట్లు వరకూ కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు.

Updated Date - Jan 25 , 2026 | 04:11 AM