ఆమె నవనీతమ్మ..
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:16 AM
కాలినడకన తిరుమలకు వచ్చిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలి ఆచూకీని టీటీడీ కొనుగొంది. ఆ భక్తురాలు తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
కాలినడకన తిరుమలకు వచ్చిన ఈ 116 ఏళ్ల వృద్ధురాలు తమిళనాడు వాసి
వివరాలు సేకరించిన విజిలెన్స్
నేడు వీఐపీ దర్శనం కల్పించనున్న టీటీడీ
వయసు భక్తికి అడ్డుకాలేకపోయింది: సీఎం
తిరుమల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కాలినడకన తిరుమలకు వచ్చిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలి ఆచూకీని టీటీడీ కొనుగొంది. ఆ భక్తురాలు తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ వృద్ధురాలు అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వస్తుండగా ఓ భక్తురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం విదితమే. ఆ వీడియోలో ఉన్న ఆడియో ద్వారా ఆ వృద్ధురాలికి 116 ఏళ్ల వయస్సు అని, శ్రీవారి దర్శనం కోసం నడుచుకుంటూ వెళుతోందనే వివరాలు వెల్లడయ్యాయే తప్ప ఊరు, పేరు తెలియలేదు. ఆ వీడియో పలు సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అయింది. ఇదే అంశంపై వార్తలు కూడా రావడంతో సీఎం చంద్రబాబు కూడా ఆ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘116 ఏళ్ల వయస్సు కూడా ఆమె భక్తికి అడ్డుకాలేకపోయింది. ఆ వృద్ధురాలు కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసే విషయం. ఆమె జీవితాంతం కొనసాగించిన అచంచలమైన భక్తికి కుటుంబ సభ్యులు అండగా నిలవడం మరింత హృద్యంగా ఉంది. ఈదృశ్యం నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది’ అని సీఎం కొనియాడారు.
ఇక, ఇదే అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఎక్స్ ద్వారా స్పందిస్తూ ‘ఆ భక్తురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించుకున్నాను. ఆమె వివరాలు ఎవరికైనా తెలిస్తే దయచేసి టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని నేరుగా సంప్రదించండి’ అంటూ పోస్ట్ చేశారు. ఈక్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి వృద్ధురాలి వివరాలను గుర్తించారు. ఈ భక్తురాలు తమిళనాడుకు చెందిన నవనీతమ్మ అని, తిరుపతిలోని జీవకోనలో బంధువుల నివాసంలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో...తన విజ్ఞప్తిపై స్పందించి వృద్ధ భక్తురాలిని గుర్తించిన విజిలెన్స్ అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నానని, నవనీతమ్మకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు.