అనుమతి లేని 113 చర్చిలకు నోటీసులు
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:15 AM
‘పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చిలు ఉన్నట్టు గుర్తించాం.
పెదపేటలో రామాలయ నిర్మాణానికి నిధుల సేకరణ: రఘురామ
కాళ్ల, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ‘పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చిలు ఉన్నట్టు గుర్తించాం. ఒక్క ఆకివీడు పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చిలు నడుపుతున్నారు. వారికి రెండు రోజుల్లో నోటీసులు ఇస్తాం. రాముడి గుడిలో రాముడిని ఆరాధించకూడదనే చర్చ వచ్చింది. కనుక దాని ఆధారంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి. అనుమతులు లేనివి ఎన్ని? ఆధారాలు సేకరించాం’ అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెద అమిరంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రెవెన్యూ రికార్డు ప్రకారం పెదపేటలో రామాలయం ఉంది. అది శిథిలావస్థలో ఉన్నట్టు అధికారులు నకలు ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా భక్తుల అభిమతం మేరకు.. వారి సహకారంతో రామాలయం నిర్మిస్తాం. రూ.80 లక్షల ప్రజా విరాళంతో ప్రముఖ స్తపతి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణశిలతో అత్యంత సుందరంగా నిర్మిస్తాం. రామాలయం అభివృద్ధి కమిటీ పేరుతో కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాం. కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.10 వేలు విరాళం సేకరిస్తాం. రూ.80 లక్షలు రాగానే ఆటోమేటిక్‌గా అకౌంట్ నిలుపుదల చేయబడుతుంది’ అని రఘురామకృష్ణరాజు చెప్పారు.
పెదపేట ఘటనలో మరో పది మంది అరెస్ట్
ఆకివీడు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయం వివాదంలో మరో పది మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. శ్రీరామ నవమి రోజు పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కూటమి నేతలు, భక్తులపై కొందరు దాడులు చేశారు. ఈ కేసులో 57 మందిని నిందితులుగా గుర్తించగా సోమవారం నాటికి 31 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆకివీడులో 144 సెక్షన్ అమలులో ఉండగా పెదపేటకు చెందిన 17 మంది మహిళలు గుంపులుగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తహసీల్దార్ ఫరూఖ్ ముందు బైండోవర్ చేశారు.