లక్ష మంది మన విద్యార్థులే!
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:32 AM
నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హేన్స్‌డ్ లెర్నింగ్(ఎన్‌పీటీఈఎల్) అందిస్తున్న క్వాంటమ్ కోర్సుకు రాష్ట్ర విద్యార్థుల నుంచి అనూ హ్య స్పందన లభించింది.
‘క్వాంటమ్’ కోర్సులో ఏపీ విద్యార్థులు 1.1లక్షలు
ఫీజు రాయితీకి 57 వేల మంది ఎంపిక
దేశవ్యాప్తంగా కోర్సు చేస్తున్నవారు 3లక్షల మంది
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హేన్స్‌డ్ లెర్నింగ్(ఎన్‌పీటీఈఎల్) అందిస్తున్న క్వాంటమ్ కోర్సుకు రాష్ట్ర విద్యార్థుల నుంచి అనూ హ్య స్పందన లభించింది. దేశవ్యాప్తంగా ఈ కోర్సును 3లక్షల మంది విద్యార్థులు నేర్చుకుంటుండగా, ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే 1.1లక్షల మంది ఉండటం విశేషం. ఐఐటీ, మద్రాసు, ఐబీఎం సహకారంతో ‘ఇంట్రడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటింగ్: క్వాంటమ్ ఆల్గారిథమ్స్ అండ్ క్విస్కిట్’ కోర్సును అందిస్తోంది. ఉన్నత విద్యామండలి సూచనలతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఇతర కోర్సుల విద్యార్థులు కూడా ఈ కోర్సుకు నమోదుచేసుకున్నారు. మొత్తంగా 1.1లక్షల మంది విద్యార్థులు కోర్సు నేర్చుకునేందుకు ముందుకొచ్చారు. వారిలో డెంటల్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులు చదివే విద్యార్థులూ ఉన్నారు.
రాయితీకి ఎంపిక
కాగా, రాష్ట్ర విద్యార్థులకు పరీక్ష రాసేందుకు రాయితీ ఇవ్వాలని ఎన్‌పీటీఈఎల్‌ను ఉన్నత విద్యామండలి కోరింది. అందుకు అంగీకరించిన ఎన్‌పీటీఈఎల్ ఒక షరతు పెట్టింది. కోర్సులో కనీసం రెండు అసైన్‌మెంట్లలో 40శాతం మార్కులు రావాలని, ఆ మేరకు సాధించిన విద్యార్థులకు రూ.వెయ్యి ఫీజులో రూ.500 రాయితీ ఇస్తామని స్పష్టం చేసింది. 57,103 మంది విద్యార్థులు 40శాతం మార్కులు సాధించి పరీక్ష ఫీజులో రాయితీకి ఎంపికయ్యారు. మిగిలిన విద్యార్థులు రూ.వెయ్యి చెల్లించి పరీక్ష రాయొచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది.