Share News

10,715 మందికి ఓపీఎస్‌

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:49 AM

పాతపెన్షన్‌కు అర్హులైనప్పటికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌కే (సీపీఎస్‌) పరిమితమైన 10,715 మంది ఉద్యోగులకు కూటమి సర్కారు శుభవార్త తెలిపింది. వీరికి పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) వర్తింపజేస్తూ..

10,715 మందికి ఓపీఎస్‌

  • రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర

  • 10,715 మంది సీపీఎస్‌ ఉద్యోగులకు పాత పింఛను

  • క్యాబినెట్‌ నిర్ణయంపై ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు

  • రాష్ట్రంలో 2004 సెప్టెంబరు నుంచి సీపీఎస్‌ అమలులోకి

  • అప్పటికే పలు నోటిఫికేషన్లు ఇచ్చిన నాటి చంద్రబాబు సర్కార్‌

  • వైఎస్‌ రాగానే నియామక ప్రక్రియలో ఆలస్యం

  • ఓపీఎస్‌ కోసం నాటి నుంచే ఆ ఉద్యోగుల విన్నపాలు

  • దీనికి అర్హులే అని 2020, 2023లో కేంద్రం స్పష్టత

  • అయినా పట్టించుకోకుండా వదిలేసిన జగన్‌ సర్కారు

  • నాడు తండ్రి వైఎస్‌, తర్వాత కుమారుడి నిర్లక్ష్యం

  • పీఎస్‌యూలు, వెల్ఫేర్‌ సొసైటీల్లో పదవీ విరమణ 62 ఏళ్లకు!

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్‌) లోని 10,715 మంది ఉద్యోగులకు రాష్ట్ర క్యాబినెట్‌ శుభ వార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి, అర్హులైన ఆ ఉద్యోగులకు సీపీఎస్‌ నుంచి పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్)లోకి మారేందుకు వన్‌-టైమ్‌-ఆప్షన్‌ కల్పించేందుకు ఆమోదం తెలిపింది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పాతపెన్షన్‌కు అర్హులైనప్పటికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌కే (సీపీఎస్‌) పరిమితమైన 10,715 మంది ఉద్యోగులకు కూటమి సర్కారు శుభవార్త తెలిపింది. వీరికి పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) వర్తింపజేస్తూ మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం ఆమోదించింది. దీంతో ఆ ఉద్యోగుల రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. రాష్ట్రంలో వైఎస్‌ సర్కారు 2004 సెప్టెంబరులో సీపీఎస్‌ను అమలులోకి తీసుకొచ్చింది. అయితే, సీపీఎస్‌ అమలులోకి రాకముందే, అప్పటి చంద్రబాబు సర్కారు హయాంలో డీఎస్సీ సహా పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఉద్యోగార్థులు పరీక్షలూ రాశారు. కానీ... నియామకాలు జరిగేసరికి సీపీఎస్‌ అమలులోకి వచ్చింది. ఆయా నోటిఫికేషన్ల ప్రకారం చూస్తే వారందరికీ ఓపీఎస్‌ వర్తింప చేయాలి. కానీ, సీపీఎస్‌కే పరిమితమయ్యారు. ఇలాంటి ఉద్యోగులు 10,715 మంది ఉన్నారు. అందులో సుమారు 6500 మంది ఉపాధ్యాయులే. ఇంకా... పోలీసులతోపాటు పలు శాఖల ఉద్యోగులూ ఉన్నారు. నోటిఫికేషన్‌ తేదీ ప్రకారం తమకు ఓపీఎస్‌ వర్తింప చేయాలని వీరంతా ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు... ఇన్నేళ్లకు వారి సమస్యకు పరిష్కారం లభించింది.


నాడు తండ్రి వైఎస్‌ ఉద్దేశపూర్వక జాప్యం...

ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2003లో పలు నోటిఫికేషన్లు ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన కూడా అయిపోయింది. అయితే... వివిధ రకాల సాంకేతిక, పరిపాలనాపరమైన కారణాలు, న్యాయపరమైన కారణాల వల్ల ఆయా భర్తీ ప్రక్రియ, ఉద్యోగుల పోస్టింగులు ఆలస్యమయ్యాయి. ఆ నియామకాలు జరిగితే క్రెడిట్‌ చంద్రబాబుకు దక్కుతుందనే ఉద్దేశంతోనే... వైఎస్‌ సర్కారు కావాలనే జాప్యం చేసిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఆయా ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వడంలోనూ సంవత్సరం, రెండేళ్లపాటు ఆలస్యం జరిగింది. ఈలోపే వైఎస్‌ ప్రభుత్వం సీపీఎస్‌ను అమలులోకి తెచ్చింది. దీంతో... పాత నోటిఫికేషన్ల మేరకు ఓపీఎ్‌సకు అర్హత ఉన్న 10,715 మంది సీపీఎ్‌సలోకి వచ్చేశారు.


ఆపై కుమారుడు జగన్‌ నిర్లక్ష్యం...

సీపీఎస్‌ అమలులోకి రాకముందే నోటిఫికేషన్‌ వెలువడి... తర్వాత నియామకాలు జరిగిన వారికి ఓపీఎస్‌ వర్తింపచేయడంపై 2020 ఫిబ్రవరి 17వ తేదీనే కేంద్రం స్పష్టత ఇచ్చింది. దీనిపై ఓఎం 57 విడుదల చేసింది. దీని ప్రకారం... సీపీఎస్‌ అమలుకు ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడి, ఫలితాలు కూడా వెల్లడై, నియామకం మాత్రం ఆలస్యమైన వారందరికీ ఓపీఎ్‌సను వర్తింప చేయాలి. కేంద్రం దీనిని అప్పుడే అమలులోకి తెచ్చింది. ఇదే విధానాన్ని అనుసరించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ... నాటి జగన్‌ సర్కారు దీనిని పట్టించుకోలేదు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఏపీలో సీపీఎ్‌సను అమలులోకి తేగా... ఆ తర్వాత సుమారు 10,715 మంది ఉద్యోగులను ఓపీఎస్‌లోకి చేర్చే అర్హత ఉన్నా జగన్‌ పట్టించుకోకుండా వదిలేశారు. 2023లో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఇదే అంశంపై స్పష్టత ఇచ్చింది. అయినా... జగన్‌ పట్టించుకోలేదు. ఓపీఎస్‌కు అర్హులైనప్పటికీ సీపీఎస్‌లో ఉన్న వేలాది మంది ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేశారు. ‘‘అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తా’’ అని 2019 ఎన్నికల ముందు ఊరూవాడాహోరెత్తించిన జగన్‌... సీపీఎస్‌ రద్దు చేయలేదు సరికదా, ఓపీఎస్‌కు అర్హులైన వారినీ పట్టించుకోలేదు.


ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు..

కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి మంగళవారంనాటి క్యాబినెట్‌ అజెండాలో ఈ అంశం లేదు. దీనిని టేబుల్‌ ఐటమ్‌గా తీసుకొచ్చి ఉద్యోగులకు ఊహించని వరమిచ్చారు. ‘‘2003లో డీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీసులు ఉద్యోగాలకు నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నోటిఫికేషన్‌ ఇచ్చారు. నేడు సరిగ్గా 23ఏళ్ల తర్వాత అదే చంద్రబాబు వారికి పాత పెన్షన్‌ విధానం తీసుకొచ్చారు. నాడు ఉద్యోగాలు ఇచ్చింది.. నేడు పాత పెన్షన్‌ ఇచ్చి భరోసా కల్పించింది చంద్రబాబే’’ అని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

చారిత్రాత్మక నిర్ణయం: ఏపీ జేఏసీ చైర్మన్‌

ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్‌, భద్రత, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం దిశగా క్యాబినెట్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ఏపీ ఎన్జీజీవో సంఘం హర్షిస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ఓపీఎస్‌ అమలు నిర్ణయం ఉద్యోగుల దీర్ఘకాలిక పోరాటానికి దక్కిన గొప్ప విజయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల విద్యా సంస్థల, వివిధ సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని స్వాగతించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి పయ్యావుల కేశవ్‌, విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మిగిలిన సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు.

పెద్దకొడుకుగా నిలిచిపోతారు: రామకృష్ణ

సుమారు 11వేల మంది ఉద్యోగులకు ఓపీఎస్‌ అమలు చేస్తూ వారి కుటుంబాల్లో సీఎం చంద్రబాబు ఆనందాన్ని నింపారని, వారి కుటుంబాల్లో ఆయన పెద్దకొడుకుగా మిగిలిపోతారని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రామకృష్ణ అన్నారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం అంటూ సీఎం చంద్రబాబుకు, మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి జీపీఎస్‌ తీసుకొచ్చింద ని అప్సా ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్‌ చెప్పారు. ఓపీఎస్‌ అమలుపై సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజేశ్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ సంఘాల హర్షం

2003లో నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై సీపీఎస్‌లోకి వచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఓపీఎస్‌ విధానం అమలుచేసేందుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, ఏపీటీఎఫ్ -అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, రామిశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘునాథరెడ్డి, ఎల్‌.సాయి శ్రీనివాస్‌, ఆపస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.బాలాజీ, జీవి సత్యనారయణ, ఏపీటీఎఫ్‌-1938 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి, ఆర్‌జేయూపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎం.షరీఫ్‌, బీటీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతి రామారావు, చిట్టేటి రమేష్‌, నోబుల్‌ టీచర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండూరు శ్రీనివాసరాజు, బొనిగల హైమారావు, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్‌, ఏపీసీపీఎ్‌సఈఏ సంఘం రాష్ట అధ్యక్ష, కార్యదర్శులు బాజీ పఠాన్‌, కరిమి రాజేశ్వరరావు, ఏపీఎస్టీఏ రాష్ట అధ్యక్ష, కార్యదర్శులు కాడిశె ట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు, ఓపీఎస్‌ రాష్ట్ర కన్వీనర్లు కొమ్మనబోయిన లక్ష్మీ శ్రీనాథ్‌, ఎం.సుబ్బారెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jun 24 , 2026 | 03:53 AM