Share News

10,15,632

ABN , Publish Date - May 07 , 2026 | 12:26 AM

జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఓటర్ల లెక్క ఓ కొలిక్కి వచ్చింది. అన్ని పంచాయతీల్లో కలిపి 10,15,632 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే 29,318 మంది అధికంగా ఉన్నారు. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను ఇప్పటికే అధికారులు రెడీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.

10,15,632

- జిల్లాలోని పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య

- మహిళలు 5,22,460

- పురుషులు 4,93,142

- ఇతర ఓటర్ల సంఖ్య 30

- పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం

- జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు 497

- వార్డుల సంఖ్య 4,848

- పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం!

- ఎన్నికలకు సర్వంసిద్ధం చేస్తున్న అధికారులు

జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఓటర్ల లెక్క ఓ కొలిక్కి వచ్చింది. అన్ని పంచాయతీల్లో కలిపి 10,15,632 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే 29,318 మంది అధికంగా ఉన్నారు. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను ఇప్పటికే అధికారులు రెడీ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు కొనసాగుతున్నాయి. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసే నాటికే జిల్లాలోని 497 పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు రెడీ చేసి, ముద్రించి ఉంచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేస్తే అందుకు అనుగుణంగా పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు డీపీవో కార్యాలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందుగానే పంచాయతీల వారీగా రిజర్వేషన్లను కూడా ప్రకటించనున్నారు.

పంచాయతీల్లో తేలిన ఓటర్ల లెక్క

జిల్లాలోని 497 పంచాయతీల్లో 4,848 వార్డులు ఉన్నాయి. వాటిలో 10,15,632 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. వీరిలో పురుష ఓటర్లు 4,93,142 మంది, మహిళా ఓటర్లు 5,22,460 మంది, ఇతర ఓటర్లు 30 మంది ఉన్నట్లుగా చూపారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు 29,318 మంది అధికంగా ఉన్నారు. పంచాయతీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో జిల్లాలోని 25 మండలాల్లో ఉన్న పంచాయతీల సంఖ్యను బట్టి సగం పంచాయతీలను మహిళలకు కేటాయించాల్సి ఉంది. పంచాయతీల్లో ఉన్న వార్డుల సంఖ్యను బట్టి సగం వార్డులను మహిళలకు కేటాయిస్తారు. దీంతో జిల్లాలోని 4,848 వార్డుల్లో 2,424 మంది మహిళలు పంచాయతీ వార్డు సభ్యులుగా ఎన్నిక కానున్నారు.

జూన్‌, జూలైలో ఎన్నికలు!

గత నెల 2వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో సాధ్యమైనంత త్వరగానే పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు అవకాశం ఉందని డీపీవో కార్యాలయ అధికారులు చెబుతున్నారు. పంచాయతీలతో పాటు మునిసిపాలిటీల్లోని పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ముందస్తుగా మునిసిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెప్పుకుంటున్నారు. జూన్‌, జూలై నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంపై అనుమతులు ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారు. గతంలో మచిలీపట్నం మండలంలో తొమ్మిది పంచాయతీలకు, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని తొమ్మిది పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. ఈ 18 పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. ఈ పంచాయతీలకు సంబంధించి కోర్టులో ఉన్న వివాదాలు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే నాటికి పరిష్కారమైతే వాటిలోనూ ఎన్నికలు జరుపుతామని డీపీవో కార్యాలయ అధికారులు చెబుతున్నారు.

Updated Date - May 07 , 2026 | 12:26 AM