జాబ్ క్యాలెండర్ వచ్చేసింది
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:15 AM
నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. 10,060 పోస్టులతో భారీ జాబ్ క్యాలెండర్‌ను కూటమి ప్రభుత్వం ఉగాది సందర్భంగా గురువారం విడుదల చేసింది.
నాలుగు విడతల్లో 41 నోటిఫికేషన్లు
ఈ ఏడాదికి 10,060 ఉద్యోగాల భర్తీ
టీచర్ పోస్టులు 2,535.. కానిస్టేబుల్స్ 2,370
గ్రూప్1లో 91.. గ్రూప్2లో 750 పోస్టులు
నైపుణ్యం పోర్టల్‌లో నమోదు చేసుకోండి
ఇక ఏటా ఉద్యోగాల ప్రకటన పండగ: లోకేశ్
అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. 10,060 పోస్టులతో భారీ జాబ్ క్యాలెండర్‌ను కూటమి ప్రభుత్వం ఉగాది సందర్భంగా గురువారం విడుదల చేసింది. మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది నాలుగు విడతల్లో మొత్తం 41 నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మే 15, ఆగస్టు 15, సెప్టెంబరు 15, అక్టోబరు 15 తేదీల్లో ఈ నోటిఫికేషన్లను విడుదల చేస్తారు. డీఎస్సీ ద్వారా మరోసారి 2,535 టీచర్ ఉద్యోగాలను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 1,970 కానిస్టేబుల్ పోస్టులను, ఏపీపీఎస్సీ ద్వారా 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల నియామకాలను పూర్త్తిచేస్తారు. 147 ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టులను అగ్నిమాపక శాఖ భర్తీ చేస్తుంది. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,500 పోస్టులకు ఏపీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహిస్తుంది. అనంతరం యూనివర్సిటీల్లో ఇంటర్వ్యూల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్-1లో 91 పోస్టులు, ఎస్‌ఐ 418, జైల్ వార్డెన్(మెన్) 171, ఫోరెన్సిక్ లేబొరేటరీ పోస్టులు 64, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 93, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 48, బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ 100, ప్లానింగ్‌లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251, ఇండస్ర్టియల్ ప్రమోషన్ ఆఫీసర్ 95, గ్రూప్-2లో 750, గనుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 503, ఏఎంవీఐ 50, డైట్ లెక్చరర్ 104, డైట్ సీనియర్ లెక్చరర్ 46, ఇంటర్ జూనియర్ లెక్చరర్ 209, పాఠశాల విద్యాశాఖలో లైబ్రేరియన్స్ 100 పోస్టులు ఉన్నాయి.

ఇతర శాఖల్లో పోస్టులు
ఎఫ్‌ఎ్‌సఎల్ అసిస్టెంట్ డైరెక్టర్-8, సోషల్ వెల్ఫేర్ ఏఎ్‌సడబ్ల్యూవో-11, ట్రైబల్ వెల్ఫేర్ ఏటీడబ్ల్యూవో-6, ట్రైబల్ వెల్ఫేర్ ఏడీ-1, అటవీ శాఖలో ఎఫ్‌ఆర్‌వో-4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్-35, ఎఫ్‌ఎ్‌సవో-41, అదేశాఖలో టెక్ అసిస్టెంట్-20, పీసీబీలో పర్యావరణ ఇంజనీర్లు-40, ప్లానింగ్ ఏడీ-17, ఉద్యాన అధికారులు- 25, పశుసంవర్ధక శాఖ-80, కార్మిక శాఖలో ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్-12, జువైనల్ శాఖలో సూపర్‌వైజర్-49, గనుల శాఖలో ఏడీ-1, టెక్నికల్ అసిస్టెంట్-36, రాయల్టీ ఇన్‌స్పెక్టర్-9, ల్యాబ్ అసిస్టెంట్-1, ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్-9, ఎస్‌సీఈఆర్‌టీ లెక్చరర్-10 పోస్టులు ఉన్నాయి.
మాట నిలబెట్టుకున్నా: మంత్రి లోకేశ్
జాబ్ క్యాలెండర్ విడుదల అంశంపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని మంత్రి లోకేశ్ అన్నారు. ‘యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. నిర్దేశిత సమయంలో పోస్టుల భర్తీ పూర్తిచేస్తాం. ఉద్యోగార్థులంతా నైపుణ్యం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఇక ప్రతి ఏటా ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. పరీక్షలకు సిద్ధం అవ్వండి’ అని ఎక్స్‌లో పిలుపిచ్చారు.
