10 వేల కిలోమీటర్ల మేఘం అవాస్తవం
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:26 AM
భారతదేశం నుంచి దక్షిణ కొరియా వరకు పది వేల కిలోమీటర్ల పొడవైన వర్షపు మేఘం ఆవరించిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు అవాస్తమని విశాఖకు చెందిన వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.
భారత్ నుంచి దక్షిణ కొరియా వరకూ విస్తరించిన చిత్రాలు ఏఐ సృష్టే: వాతావరణ నిపుణులు
విశాఖపట్నం, జూలై 23(ఆంధ్రజ్యోతి): భారతదేశం నుంచి దక్షిణ కొరియా వరకు పది వేల కిలోమీటర్ల పొడవైన వర్షపు మేఘం ఆవరించిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు అవాస్తమని విశాఖకు చెందిన వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తర భారతం నుంచి దక్షిణ కొరియా వరకు విస్తరించిన విశాలమైన రుతుపవన వర్షపు మేఘాలను ఉపగ్రహాలు కెమెరాల్లో బంధించాయంటూ సామాజిక మాధ్యమాలతోపాటు కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్లు కూడా ప్రచురించాయి. ఇవి వైరల్‌గా మారాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇస్రో వాతావరణ విభాగాన్ని సంప్రదించారు. భారత్, దక్షిణ కొరియాలో వాతావరణ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని వారు వివరించారు. ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర పరిసరాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కొంతమేర మేఘాలు ఉన్నాయన్నారు. అవగాహన లేకుండా ప్రచురించే కథనాలను నమ్మవద్దని సూచించారు. కాగా ఉత్తర భారతం నుంచి దక్షిణ కొరియా వరకు పది వేల కి.మీ. మేర మేఘం విస్తరణ ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అని ఎన్‌ఐడీఎం సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు.