Agricultural Support: రైతుల ఖాతాల్లో 10 వేల కోట్లు
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:33 AM
రైతులను జగన్ అప్పులపాలుచేసి రోడ్డున పడేస్తే.. మేం రైతన్న ఇంట సంక్రాంతి శోభను తెచ్చాం. వైసీపీ హయాంలో రైతుల కష్టాన్ని దళారులు, ఆ పార్టీ నాయకులు దోచుకుంటే మేం ఆ వ్యవస్థకు స్వస్తి చెప్పి, గిట్టుబాటు ధరను నేరుగా...
అన్నదాతకు నిజమైన సంక్రాంతి
జగన్ వారిని రోడ్డున పడేస్తే.. మేము వారిలో ఆనందం నింపాం
వైసీపీ హయాంలో కొన్నది 10 శాతమే
మేం 41.27 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం
రికార్డు సృష్టించటం కూటమికే సాధ్యం
24 కాదు... 4 గంటల్లోనే నగదు జమ
అమరావతిపై విష ప్రచారం మానాలి: మంత్రి మనోహర్
తెనాలి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): ‘‘రైతులను జగన్ అప్పులపాలుచేసి రోడ్డున పడేస్తే.. మేం రైతన్న ఇంట సంక్రాంతి శోభను తెచ్చాం. వైసీపీ హయాంలో రైతుల కష్టాన్ని దళారులు, ఆ పార్టీ నాయకులు దోచుకుంటే మేం ఆ వ్యవస్థకు స్వస్తి చెప్పి, గిట్టుబాటు ధరను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం.’’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటి వరకు రూ.10 వేల కోట్ల మేరకు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అవగాన లేని వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఏమవుతుందనేది జగన్ చేతకాని పాలన స్పష్టం చేసిందని విమర్శించారు. అనుభవం, దక్షత ఉన్న చంద్రబాబు వంటి వ్యక్తి సీఎం అయితే ప్రతి ఇంట సిరులపంట పండుతుందనేది నిరూపించారని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు 6,76,848 మంది రైతుల నుంచి 41.27 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, దీని విలువ రూ. 9,789 కోట్లు ఉంటుందని చెప్పారు. మంగళవారం సాయంత్రానికి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి చెల్లింపులు కేవలం 4 గంటల్లోనే పూర్తి చేశామన్నారు.
ఈ రోజే రూ.10 వేల కోట్ల రికార్డు స్థాయి చెల్లింపుల లక్ష్యాన్ని అధిగమించామని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో కొనుగోళ్లు జరగలేదన్నారు. కేవలం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చొరవతోనే ఈ ప్రగతి సాధించామని చెప్పారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి సంవత్సరంలో గుంటూరు జిల్లాలో 552 మంది రైతుల నుంచి 5,913 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, తాము 11,773 మంది రైతుల నుంచి 76,015 టన్నుల ధాన్యం కొన్నామని వివరించారు. పైగా కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బు కూడా నెలల తరబడి రైతులు ఖాతాల్లోకి వేయలేదన్నారు. ప్రస్తుతం తాము చెప్పినట్టు 24 గంటలు కాకుండా, కేవలం 4 గంటల వ్యవధిలోనే 78 శాతం మంది రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ చేశామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 98 శాతం మేర రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తే, కాకినాడ జిల్లాలో 97 శాతం మేరకు ధాన్యం కొన్నామన్నారు.
అసత్య ఆరోపణలు ఆపు!
నాలుగు గోడల మధ్య కూర్చుని అసత్య ఆరోపణలు చేసే ముందు జగన్ సహా ఆయన అనుచర మూర్ఖులు క్షేత్రస్థాయికి వెళ్లి కూటమి ప్రభుతం చేస్తున్న అభివృద్ధిని, జనం అభిప్రాయాలను తెలుసుకోవాలని మనోహర్ హితవు పలికారు. పరిపాలన చేతకాక, వనరులను వినియోగించుకోవటం తెలియక జగన్ పాలనలో వ్యవస్థలను నాశనం చేశారని విమర్శించారు. అమరావతిపై ఇప్పటికీ విషం చిమ్ముతున్నారని అన్నారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలను మానుకోవాలని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు వెళ్లినా ఆయనకు మాత్రం తన రాజకీయం, పదవులే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.