వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురి అరెస్టు
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:19 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం మత్స్యపురం జంక్షన్ వద్ద 1,000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు.
ఒడిశా నుంచి అనకాపల్లి జిల్లాకు తరలిస్తూ పట్టుబడ్డ నిందితులు
పాడేరురూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా), ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం మత్స్యపురం జంక్షన్ వద్ద 1,000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు. డీఎస్పీ ఆర్‌వీవీఎస్ అభిషేక్ తెలిపిన వివరాలు.. శనివారం రాత్రి జి.మాడుగుల పోలీసులు మత్స్యపురం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తూ ఒడిశా వైపు నుంచి వస్తున్న వ్యాన్‌ను ఆపారు. డ్రైవర్ కిందకు దిగి పరారయ్యాడు. పోలీసులు వ్యాన్‌ను తనిఖీ చేయగా గోనె సంచుల్లో గంజాయి కనిపించింది. వ్యాన్‌లో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామానికి తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారు. వీరిలో ముగ్గురిని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల, పెదబయలు మండలాలకు, ఒకరు అనకాపల్లి జిల్లాకు, మరొకరు ఒడిశాలోని కొత్తూరుకు చెందిన వారిగా గుర్తించారు. నిందితులను సోమవారం కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.