భళా.. భారత నేవీ..!
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:50 AM
బంగాళాఖాతంలో భారత్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎ్‌ఫఆర్) బల ప్రదర్శన కాదని.. అంతరాత్జీయ స్నేహసంబంధాలకు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
విశాఖ తీరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష
ఇది బలప్రదర్శన కాదు.. స్నేహానికి ప్రతీక: రాష్ట్రపతి ముర్ము
ఐఎఫ్ఆర్‌లో పాల్గొనడం గౌరవంతోపాటు ఆనందాన్నిస్తోంది
‘సురక్షిత సముద్రం-సమృద్ధి భారత్’.. ఇదే భారత నేవీ లక్ష్యం
సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సముద్ర దోపిడీ నియంత్రణ
వంటి అంశాల్లో దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపు
రెండు గంటలకుపైగా సమీక్ష.. ఆకట్టుకున్న ఐఎన్‌ఎస్ విక్రాంత్
గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరు
నేడు విశాఖకు రాజ్‌నాథ్.. ‘మిలాన్-2026’ ప్రారంభం
విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో భారత్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎ్‌ఫఆర్) బల ప్రదర్శన కాదని.. అంతరాత్జీయ స్నేహసంబంధాలకు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖ సాగర తీరాన బుధవారం ఉదయం ఆమె ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. ఆరు వరుసల్లో 80కి పైగా నౌకలు బారులు తీరి ఉండగా... వాటి మధ్య నుంచి ప్రత్యేక రథం (ఐఎన్‌ఎస్ సుమేధ)పై ఆమె ప్రయాణిస్తూ ఆయా నౌకల సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇందులో భారత నేవీకి చెందిన నౌకలు 60, విదేశీ నౌకలు 19, కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, సర్వే నౌకలు మరో ఏడింటితో పాటు మూడు సబ్‌మెరైన్లు, సెయిలింగ్ నౌకలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భారత వైమానిక దళం సాహస విన్యాసాలు ప్రదర్శించింది. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ఐఎ్‌ఫఆర్‌లో పాల్గొనడం అపారమైన గౌరవంతో పాటు ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. భారత నౌకాదళం ‘సురక్షిత సముద్రం-సమృద్ధి భారత్’ లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సముద్ర దోపిడీ నియంత్రణ వంటి అంశాల్లో ఒక దేశానికి మరో దేశం సహకరించుకోవాల్సి ఉందన్నారు. భారత నౌకాదళం మరింత బలోపేతం కావాలని, ప్రపంచశాంతి స్థాపనలో ముందుండాలని ఆమె ఆకాంక్షించారు. సమీక్షకు ముందు రాష్ట్రపతి జెట్టీ వద్దకు రాగా 150 గార్డులు గౌరవ వందనం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా, భారత నౌకాదళాధిపతి దినేశ్ త్రిపాఠి, తూర్పు నౌకాదళాధిపతి సంజయ్‌భల్లాతో కలిసి ఐఎన్‌ఎస్ సుమేధపై సముద్రంలోకి వెళ్లి నౌకాదళ సమీక్ష చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
‘సముద్రాల ద్వారా ఏకమవుదాం..’
విశాఖలో బుధవారం జరిగిన ఐఎఫ్ఆర్‌లో 74 దేశాలు పాల్గొన్నాయి. సముద్రంలో 85 నౌకలను మోహరించారు. వాటిలో 19 విదేశీ నౌకలు కూడా ఉన్నాయి. సమీక్షకు ఏర్పాటుచేసిన ఆరు వరుసల్లో 52 నౌకలను యాంకరింగ్‌లో నిలిపి ఉంచారు. ఈ విన్యాసాల్లో నేవీకి చెందిన నౌకలు 60వరకూ ఉన్నాయి. ‘సముద్రాల ద్వారా ఏకమవుదాం..’ అనే నినాదంతో చేపట్టిన ఐఎ్‌ఫఆర్ విజయవంతమైందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత నేవీ: రామ్మోహన్
భారత నౌకాదళం ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎదుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. విశాఖలో బుధవారం జరిగిన ఐఎ్‌ఫఆర్‌లో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఐఎఫ్ఆర్‌లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సమీక్ష భారత సముద్ర శక్తిని, ప్రపంచ దేశాలతో పెంచుకుంటున్న భాగస్వామ్యాన్ని ప్రతిబింబించిందన్నారు. ఇందులో విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ కూడా పాల్గొనడం గర్వకారణమన్నారు.
నేడు విశాఖకు రాజ్‌నాథ్.. ‘మిలాన్-2026’ ప్రారంభం
కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం విశాఖపట్నం రానున్నారు. భారత నౌకాదళం నిర్వహిస్తున్న ‘మిలాన్-2026’ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా నౌకాదళ ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. సముద్రిక ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో దేశ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళ్లిపోతారు.
రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు
రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సాయంత్రం తిరిగి ఢిల్లీ పయనమయ్యారు. నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్ డేగాలో ఆమెకు గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, కలెక్టర్ హరేంధిరప్రసాద్, నేవీ ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.
నేడు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌రోడ్డులో గురువారం సాయంత్రం ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగనుంది. భారత నౌకాదళం ఈ నెల 15 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, మిలాన్-2026లో భాగంగా ఈ పరేడ్ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని బీచ్‌రోడ్డులో కవాతు నిర్వహిస్తారు. వారి దేశాలకు చెందిన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రదర్శిస్తారు. దీనికి ముందు నేవీ వైమానిక విభాగం సాహస విన్యాసాలు చేయనుంది. దీనికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’
రెండు గంటలకు పైగా నౌకాదళ సమీక్ష
విశాఖపట్నం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): విశాఖ సాగర తీరాన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) బుధవారం రెండు గంటలకు పైగా సాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సరయూ క్లాస్‌కు చెందిన ‘సుమేధ’ నౌకపై అతిథులతో కలిసి జెట్టీ నుంచి ఉదయం 10.20 గంటలకు సమీక్షకు బయల్దేరారు. తీరానికి సుమారు పది కిలోమీటర్ల దూరాన సముద్రంలో ఆరు వరుసల్లో లంగరు వేసిన 80కి పైగా నౌకల మధ్య నుంచి నెమ్మదిగా సాగుతూ, వాటిని పరిశీలిస్తూ, నావికులు చేసిన గౌరవ వందనం స్వీకరిస్తూ సమీక్షించారు. వాటిలో ప్రధానంగా విమాన వాహక యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రపతి రథం ‘సుమేధ’ వెంట అదే సరయూ క్లాస్‌కు చెందిన గస్తీ నౌకలు సుమిత్ర, సుకన్య, సునయలపై ప్రత్యేక ఆహ్వానితులను తీసుకువెళ్లారు. వివిధ నగరాల పేరుతో నేవీ ఆపరేట్ చేస్తున్న ఐఎన్‌ఎస్ మైసూర్, ఐఎన్‌ఎస్ విశాఖపట్నం, ఐఎన్‌ఎస్ చెన్నై తదితర నౌకలు ఆకట్టుకున్నాయి. సమీక్షలో చివరిగా సబ్‌మెరైన్లు సింధుకీర్తి, సింధుకేసరి, శాంకుల్ సముద్రంలో నుంచి తల పైకెత్తి బయటకు వచ్చి, కొద్దిసేపటికే మళ్లీ అదృశ్యమైపోయాయి. మెరైన్ కమెండోలు జెమినీ బోట్లపై తుపాకులు పేలుస్తూ సముద్రంలో దూసుకువెళ్లిన తీరు వారి ధైర్యసాహసాలను చాటింది.
ఆకట్టుకున్న నేవీ రిహార్సల్స్
ఐఎఫ్ఆర్‌లో భాగంగా బుధవారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన పూర్తిస్థాయి రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. చేతక్ హెలికాప్టర్లు, మిగ్ 29కే యుద్ధ విమానాలు, నిఘా విమానం పీ8ఐ, కమోవ్ హెలికాప్టర్లు ఇందులో పాల్గొన్నాయి. విన్యాసాల అనంతరం సిటీ పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఇండియన్ నేవీ బ్యాండ్, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బృందాలతోపాటు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్న దేశాలకు చెందిన నౌకాదళ సిబ్బంది భాగస్వామ్యమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల బృందాలు పరేడ్‌లో ప్రదర్శన ఇచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన శకటాలు కూడా పాల్గొన్నాయి. అనంతరం నౌకలపై నుంచి లేజర్ షో, తీరంలో ఫైర్ వర్క్స్ నిర్వహించారు.