Share News

ముందుగానే ‘పది’ పాఠాలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:31 AM

పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ తరహా బోధనకు శ్రీకారం చుడుతోంది. వచ్చే ఏడాది చదవాల్సిన పాఠాలను విద్యార్థులకు ఇప్పుడే బోధించాలని నిర్ణయించింది.

ముందుగానే  ‘పది’ పాఠాలు

  • 9వ తరగతికి మార్చిలోనే ఎస్‌ఏ-2 పరీక్షలు

  • ఆ వెంటనే పదో తరగతి సిలబస్‌ ప్రారంభం

  • ప్రతి సబ్జెక్టులో నాలుగు చాప్టర్ల బోధన

  • విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెరిగి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలకు అవకాశం

  • ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారిగా బ్రిడ్జి విధానం

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ తరహా బోధనకు శ్రీకారం చుడుతోంది. వచ్చే ఏడాది చదవాల్సిన పాఠాలను విద్యార్థులకు ఇప్పుడే బోధించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులకు ముందుగానే పదో తరగతి సిలబస్‌ ప్రారంభిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే కొంత సిలబ్‌సను పూర్తి చేయడం వల్ల.. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన సమయాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి మొట్టమొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ విధానం ప్రవేశపెడుతోంది. అందుకోసం తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్‌ అసె్‌సమెంట్‌-2 (తుది పరీక్షలు)ను నెల రోజులు ముందుకు తీసుకొచ్చింది. ఉన్నత పాఠశాలల్లో 6-8 తరగతుల విద్యార్థులకు ఎస్‌ఏ-2 పరీక్షలు ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు జరుగుతాయి. ప్రతి ఏటా 9వ తరగతి పరీక్షలు కూడా వీరితో కలిపి జరిగేవి. కానీ ఈ ఏడాది టెన్త్‌ సిలబ్‌సను ముందే ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు.. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మార్చి 12తోనే ఎస్‌ఏ-2 పరీక్షలను పూర్తిచేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 23 వరకు పాఠశాలల పనిదినాలు ఉంటాయి. ఈ 40 రోజుల్లో వారికి పదో తరగతి సిలబ్‌సను బోధిస్తారు. ప్రతి సబ్జెక్టులో నాలుగు చాప్టర్ల చొప్పున పాఠ్యాంశాలు పూర్తి చేస్తారు. అందులో క్లిష్టంగా ఉండే పాఠ్యాంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వాటిని చదువుకునేలా ఈ బోధన జరుగుతుంది. అనంతరం 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక మిగిలిన పాఠ్యాంశాల బోధన ప్రారంభమవుతుంది. దీనివల్ల వచ్చే విద్యా సంవత్సరంలో టెన్త్‌ సిలబస్‌ చాలా ముందుగానే పూర్తవుతుంది. మిగిలిన సమయాన్ని పబ్లిక్‌ పరీక్షల సన్నద్ధతకు ఉపయోగిస్తారు. ఎక్కువ సమయం ఉండటం వల్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెరిగి, ఉత్తమ ఫలితాలు వస్తాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్‌లో ఈ తరహా బ్రిడ్డి కోర్సుల విధానం ఉంది. పాఠశాల నుంచి ఇంటర్‌కు వెళ్లే విద్యార్థులు అయోమయానికి గురికాకుండా జూనియర్‌ కాలేజీలూ బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తుంటాయి. ఇప్పుడు పాఠశాల విద్యా శాఖ కూడా అలాంటి బ్రిడ్జి విధానం తీసుకొస్తోంది.

Updated Date - Feb 28 , 2026 | 05:31 AM