Share News

Severe Cold Wave Grips: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. వైరల్ రోగాల బారిన జనాలు

ABN , Publish Date - Dec 24 , 2025 | 06:41 PM

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎముకలు కొరికే చలితో నానా ఇబ్బందులు పడుతున్నారు. వైరల్ రోగాలు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు.

Severe Cold Wave Grips: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. వైరల్ రోగాల బారిన జనాలు
Severe Cold Wave Grips

తెలుగు రాష్ట్రాలను చలి పులి భయపెడుతోంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైరల్ రోగాలు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు. రాత్రి పూట పరిస్థితి దారుణంగా తయారు అవుతోంది. ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు, మూడు రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వెల్లడించింది. తెలంగాణలోని అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగాం,


సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 26వ తేదీ వరకు పలు జిల్లాల్లో 5 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 8 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పటాన్ చెరులో 8.4, రాజేంద్ర నగర్‌లో 9.5, హయత్ నగర్‌లో 11.6, బేగంపేటలో 12.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి మొదలైతే.. మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు కూడా చలి తగ్గటం లేదు.


ఏపీలోనూ ఇదే పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అరకు, పాడేరు, చింతపల్లిలో 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం పూట మంచు భారీగా కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి విపరీతంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులతోపాటు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత ఈ డిసెంబర్ నెలాఖరు వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తెగ ట్రెండ్ అయిన సంఘటనలు ఇవే..

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంఘటనలు ఇవే..

Updated Date - Dec 24 , 2025 | 06:46 PM