kumaram bheem asifabad-‘స్థానిక’ పోరుపై యువత గురి
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:02 PM
త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది యువకులు సన్నద్ధమవుతున్నారు. ఏ నోటా విన్నా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల మాటనే. ప్రతి గ్రామంలో ఈ సారి యువకులు పోటీకి దిగుతారని చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని చెబుతున్నారు. ఈ సారి తాము నిలబడి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా చేస్తామని భావిస్తున్నారు.
- ప్రశ్నించే గొంతుగా ఉంటామని ప్రజలకు భరోసా
- రసవత్తరం కానున్న పంచాయతీ ఎన్నికలు
బెజ్జూరు ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది యువకులు సన్నద్ధమవుతున్నారు. ఏ నోటా విన్నా ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల మాటనే. ప్రతి గ్రామంలో ఈ సారి యువకులు పోటీకి దిగుతారని చెబుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని చెబుతున్నారు. ఈ సారి తాము నిలబడి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా చేస్తామని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో యువకులు ప్రచారాన్ని మొదలు పెట్టి రాజకియాన్ని వేడెక్కిస్తున్నారు. పార్టీలకు అతీతంగా పోటీ చేస్తామని, తాము గెలిస్తే గ్రామంలో పలానా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెబుతున్నారు. అర్హులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను సద్వినియోగం అయ్యేలా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పాలన కొనసాగుతుందని, ప్రజల తరుపున ప్రశ్నించే గొంతుగా ఉంటామని గ్రామల్లో ఇప్పటి నుంచే భరోసా కల్పిస్తున్నారు.
- ఆందోళనలో ఆశావహులు..
యువత ఉత్సాహంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతుండడంతో అన్ని పార్టీలలో పెద్ద లీడర్లుగా కొనసాగుతున్న వారు, కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. సర్పంచ్‌లుగా,ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు అస్ర్తాలను సిద్ధం చేసుకుటున్న వారికి ఈసారి ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా పోటీ మాత్రం యువకులతో తీవ్రంగా ఉండనున్నట్లు మాత్రం స్పష్టమవుతోంది. యువకుల నుంచి పోటీ తప్పదని స్పష్టం కావడంతో రాజకీయాల్లో కొనసాగుతున్న ఆశావహులు గ్రామాల్లో విందు రాజకీయాలు, ఓదార్పు రాజకీయాలను మొదలుపెట్టారు. గ్రామంలో ఎవరైన మరణించినా, శుభకార్యాలు ఉన్న ఇంట్లో వాలిపోయి అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ అష్టకష్టాలు పడుతూ వారి మన్ననలు పొందేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు ఇతర పార్టీలలో ఉంటూ సుదీర్ఘ కాలంగా ఉన్న వావరితో యువకులు పంచాయతీ ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నారు.
- సోషల్ మీడియాను..
నేటి రోజుల్లో జేబులో డబ్బులు లేకున్నా ప్రతి ఒక్కరికి మాత్రం ఆడ, మగ తేడా లేకుండా సెల్‌పోన్ తప్పనిసరైంది. దీంతో యువకులు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి మొదలు అర్దరాత్రి వరకు రాజకీయంపై చర్చలు పెడుతూ, గ్రూపు చాటింగ్‌లు చేస్తూ,స్టేటస్‌లు పెట్టుకుంటూ యువకులు రాజకీయాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
- రిజర్వేషన్ల కోసం..
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అధికారుల వద్దకు వెళ్లి గత రిజర్వేషన్లు ఖరారు అవుతాయా లేదంటే రిజర్వేషన్లు మారుతాయా అని వాకబు చేస్తున్నారు. ఇది వరకే ఉన్న రిజర్వేషన్లనే ఈ సారి కూడా ఉంటే పోటీదారులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అన్ని కలిసొచ్చి అనుకూలంగా రిజర్వేషన్లు వస్తే మాత్రం తప్పనిసరిగా ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని గ్రామాల్లో ఆశావహులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మచ్చిగా చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు ఖరారు అయితే మరికొంత మంది సైతం బయటకు వచ్చే అవకాశం ఉండకపోలేదు.