Police Brutality: విచారణ పేరుతో చితకబాదిన పోలీసులు
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:23 AM
హత్యకేసు విచారణ పేరుతో పోలీసులు ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిపించుకుని చితకబాదారు. తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.....
యువకుడికి అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు
ఎస్సైపై చర్యలు తీసుకోవాలనిసీఐకి కుటుంబసభ్యుల ఫిర్యాదు
పెద్దేముల్, నవంబర్ 17 (ఆంధ్రజ్యోతి): హత్యకేసు విచారణ పేరుతో పోలీసులు ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిపించుకుని చితకబాదారు. తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీ్‌సస్టేషన్‌లో జరిగింది. మంబాపుర్ గ్రామానికి చెందిన ఎండీ గౌస్ రెండు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణ పేరుతో మృతుడు గౌస్ మేనల్లుడు ఫెరోజ్‌ను ఎస్సై వేణుకుమార్, పలువురు కానిస్టేబుళ్లు ఆదివారం పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి చితకబాదారు. నడవలేని స్థితిలో ఉన్న ఫెరోజ్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. గౌస్‌కు ముగ్గురు కూతుళ్లు. మేనల్లుడు ఫెరోజ్‌ను పెంచి పెద్దచేసి, తన రెండో కూతురును ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చి రెండో కాన్పులో కన్నుమూసింది. దీంతో మూడవ కూతురును కూడా ఫెరోజ్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. ఫెరోజ్ స్థానికంగా ఓ వెల్డింగ్‌షాప్ పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన మేనమామ తనను సొంత కొడుకులా చూసుకునేవాడని, తండ్రిలాంటి మామను ఎలా హత్యచేస్తానని అతడు బోరుమంటున్నాడు. తన మామను తనే హత్యచేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెప్పాడు. విషయం తెలిసి బంధువులు, స్నేహితులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అల్లుడిని చిత్రహింసలకు గురిచేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని బాధితుడి అత్త, మృతుడి భార్య నజీమాబేగం స్వయంగా సీఐకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన భర్త చావుకు తన అల్లుడిని బాధ్యుడిని చేస్తూ పోలీసులు బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని, అంతే కాకుండా తన అల్లుడితో తనకు అక్రమ సంబంధం అంటగడుతున్నారని తెలిపారు. తనతో కలిసి తన కూతురు, అల్లుడు తన భర్తను హత్యచేసినట్లు ఒప్పుకోవాలని చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తన భర్త ఎలా చనిపోయారో తనకు చెప్పడం లేదని, రిపోర్టులు కూడా బయటపెట్టడం లేదని చెప్పారు. కేసును తప్పుదారి పట్టించి పోలీసులు హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సై వేణుకుమార్‌తో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలని కోరుతూ సీఐ నగేశ్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.