Assembly Elections: జూబ్లీ హిల్స్‌లో యువతంత్రం
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:40 AM
జూబ్లీహిల్స్..! ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీలూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. కానీ, ఇక్కడ అభ్యర్థుల తలరాతను రాసేది మాత్రం....
మొత్తం ఓటర్లలో మూడోవంతు వారే.. గెలుపోటముల్లో 18-35 మధ్య వయస్కులే కీలకం
వీరిలో దాదాపు 85 ు విద్యావంతులే
నడి వయసు వారూ ఇక్కడ నిర్ణయాత్మకమేవారిని మచ్చిక చేసుకునేందుకు పార్టీల పావులు
బంజారాహిల్స్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్..! ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీలూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. కానీ, ఇక్కడ అభ్యర్థుల తలరాతను రాసేది మాత్రం యువతే! ఇందుకు కారణం మొత్తం ఓటర్లలో మూడోవంతు యువతరమే! వీరంతా 35 ఏళ్లలోపు వయస్కులే! మరో ముఖ్య విషయం ఏమిటంటే.. యువతలో దాదాపు 85 శాతం విద్యావంతులే! అందుకే, విద్యార్థులు, ఉద్యోగులను తమవైపు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలూ కసరత్తు ముమ్మరం చేశాయి. తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. వీరిలో 18-35 సంవత్సరాల మధ్య వయస్కులు సుమారు 1,30,042 మంది ఉన్నట్టు తేలింది. వీరిలో కొత్తగా ఓటు వచ్చిన 18-19 మధ్య వయస్కులు 12,396 మంది. ఇక, 20 నుంచి 29 ఏళ్ల వయసున్న వారు 72,544 మంది. 30 నుంచి 35 వయసు ఉన్నవారు 45,102 మంది. మొత్తంగా 18-35 మధ్య వయసు ఉన్నవారు 32.4 శాతం. ఆ తర్వాత 36-40 మధ్య వయస్కులు 46,716 మంది. వీరు మొత్తం ఓటర్లలో 11.6 శాతం. అందుకే, ఇప్పుడు అన్ని పార్టీలూ యువతపై కన్నేశాయి! ఇప్పటికే ఓ పార్టీ ఐటీ నిపుణులతో సమావేశమైంది. సోషల్ మీడియాలో యువత యాక్టివ్‌గా ఉంటున్న నేపథ్యంలో.. వారే లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తోంది. మరో పార్టీ.. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఏదైనా వేడుక చేయాలని యోచిస్తోంది. యువతను ఆకట్టుకోవడంతోపాటు ఓటింగ్‌కు తీసుకు రావడంపై ఆయా పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఏయే ప్రాంతాల్లో ఏ వయసు ఓటర్లు ఎక్కువగా ఉన్నారో ఇప్పటికే జాబితాను కూడా సిద్ధం చేసుకున్నాయి.
మధ్య వయస్కులూ కీలకమే!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపోటముల్లో మధ్య వయస్కులు కూడా అత్యంత కీలకం. ఎందుకంటే, 40 ఏళ్లు దాటిన వాళ్లు కూడా ఇక్కడ ఎక్కువే. నియోజక వర్గంలో 40-59 మధ్య వయసు కలిగిన ఓటర్లు 1,53,848 లక్షల మంది. మొత్తం ఓటర్లలో వీరి శాతం 38.3 శాతం. ఇక, 60 నుంచి 80 ఏళ్లు పైబడిన వారు 62,499 మంది ఉండగా.. మొత్తం ఓటర్లలో వీరు 15.5 శాతం. అంతేనా.. నియోజకవర్గంలో 40-59 మధ్య వయసు ఉన్న వారిలో చాలా వరకు ఉద్యోగస్తులేనని అధికారులు నిర్ధారించారు. గెలుపోటముల్లో మధ్య వయస్కుల పాత్ర కూడా కీలకం కావడంతో పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నాయి. వారికి పార్టీ అమలు చేసిన చేస్తున్న పథకాలను వివరిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు అధికార పార్టీ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు గురించి చెబుతుంటే.. బీఆర్‌ఎస్ తమ హయాంలో అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ గురించి ప్రచారం చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న కార్యక్రమాలను బీజేపీ వివరిస్తోంది. ఇక, యువత ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. స్థానికత, అధికారంలో ఎవరు ఉన్నారు!? పార్టీ పనితీరు తదితర అంశాలను ఓటు వేసే ముందు సాధారణ ఓటరు పరిగణనలోకి తీసుకుంటే.. విశాలమైన రోడ్లు, ఇబ్బందుల్లేని మంచినీటి సరఫరా, ట్రాఫిక్ తదితర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై యువత ఆలోచిస్తారని, ఈ దిశగా వారిని ఆకట్టుకునేందుకు పార్టీలు పావులు కదుపుతున్నాయని ఓ పార్టీ నాయకుడు తెలిపారు. అలాగే, ఓటు ఎలా వేయాలనే అంశంపై యువతకు అవగాహన కల్పించేందుకు డమ్మీ యంత్రంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.