kumaram bheem asifabad- పల్లెల్లో యువ పాలన
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:51 PM
అత్యంత ఉత్కంఠగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈసారి యువ సర్పంచ్‌లకే పట్టం కట్టారు. గెలిచిన సర్పంచ్‌ల్లో 62 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే ఉండడం విశేషం. ఒకప్పుడు అనుభవం, పెద్దరికం ఉన్న వారిని పల్లె ఓటర్లు ఆదరించేవారు. కానీ నేడు అనుభవం కన్న ఆలోచనా శక్తి ఉన్నవారినే అక్కున చేర్చుకున్నారు. వయస్సు పైబడిన అభ్యర్థులను చాలాచోట్ల తిరస్కరించినట్లు తెలుస్తోంది.
- యువత, విద్యావంతులకే పట్టంకట్టిన ఓటర్లు
- అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారన్న నమ్మకం
ఆసిఫాబాద్: డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అత్యంత ఉత్కంఠగా ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈసారి యువ సర్పంచ్‌లకే పట్టం కట్టారు. గెలిచిన సర్పంచ్‌ల్లో 62 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే ఉండడం విశేషం. ఒకప్పుడు అనుభవం, పెద్దరికం ఉన్న వారిని పల్లె ఓటర్లు ఆదరించేవారు. కానీ నేడు అనుభవం కన్న ఆలోచనా శక్తి ఉన్నవారినే అక్కున చేర్చుకున్నారు. వయస్సు పైబడిన అభ్యర్థులను చాలాచోట్ల తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ 25 ఏళ్ల లోపు వారు 22 మంది గెలిచి సత్తాచాటగా ఓకే ఒక్క స్థానంలో 70 ఏళ్లు నిండిన వ్యక్తి గెలుపొంది తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. కాగా జిల్లాలో పంచా యతీ ఎన్నికలు ముగిసినా అభ్యర్థుల గెలుపోటములపై చర్చ సాగుతూనే ఉంది. గెలిచిన వారు తమ పనుల్లో నిమగ్నం కాగా ఓడినవారు మాత్రం తమకు పోలైన ఓట్ల గురించి తర్జనభర్జన పడు తున్నారు. ప్రధానంగా యువత బరిలో దిగిన చాలా స్థానాల్లో సీనియర్లకు ఎదురుగాలి తప్పలేదు. రాజకీయం అనుభవం , ఇం టింటా పరిచయాలు, మంచి పేరు ఉన్నప్పటికీ ఎందుకు ఓడిపోయామనే మీమాంసలో ఉన్నారు. కానీ మోజారిటీ గ్రామాల్లో ఓటర్లు యువతను ఆదరించి విభిన్నమైన తీర్పును ఇచ్చారు.
- రెండు దశాబ్దాల క్రితం వరకు..
రెండు దశాబ్దాల క్రితం వరకు గ్రామాల్లో వృద్ధులే సర్పంచ్‌లుగా ఉండేవారు. రాజకీయ అనుభవంతో పాటు కుటుంబ సమస్యలు, భూతగాదాల పరిష్కారం లో పట్టు ఉంటుందని వారికే పట్టం కట్టేవారు. గ్రామాల్లోని ప్రతీ వీధిపై, ప్రతీ ఇంటిపై పూర్తి అవగహన ఉన్న పెద్దమనుషుల వైపే అప్పట్లో మొగ్గు చూపించేవారు. ఎవరైనా యువత పోటీలో నిలిచినా అనుభవం లేదని తిరస్కరించే పరిస్థితి ఉండేది. కానీ కాలక్రమేనా గ్రామాల్లో సమీకరణాలు మారుతున్నాయి. యువకులు, విద్యావంతులను ఎన్నుకుంటే కష్టపడి పనిచేస్తారని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని గ్రామీణ ఓటర్లు విశ్వసించి యువతకే పట్టం కడుతున్నారు.
- మూడు విడతల్లో..
జిల్లాలో 15 మండలాల పరిధిలో మూడు విడతల్లో ఈనెల 11,14,17 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో వాంకిడి మండలంలోని తేజగూడ, ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి, చిలాటిగూడ గ్రామాలలో సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు అనుకులించకపోవడంతో అక్కడ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. మిగితా 332 గ్రామ పంచాయతీల్లో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఆ గ్రామ పంచాయతీల పరిధిలో 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. 2,91,216 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 25 సంవత్సరాల వరకు 22 మంది సర్పంచ్‌లుగా గెలిచారు. 26 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 43 మంది, 31 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు 82 మంది, 36 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 59 మంది, 41నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 77 మంది విజయం సాధించారు. 51 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 38 మంది, 61 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 10 మంది, 70 సంవత్సరాల వయస్సు పైబడిన ఒక్కరు సర్పంచ్‌లుగా గెలుపొందారు.