Share News

Youth Brutally Attacked: నడిరోడ్డుపై కత్తిపోట్లు

ABN , Publish Date - Nov 06 , 2025 | 02:25 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ రౌడీషీటర్‌ బరి తెగించాడు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలప్పుడు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే తన ప్రత్యర్థి...

Youth Brutally Attacked: నడిరోడ్డుపై కత్తిపోట్లు

  • యువకుడిపై కత్తితో పాశవిక దాడి

  • బాధితుడు, నిందితుడు ఇద్దరూ రౌడీషీటర్లే

  • హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఘటన

జీడిమెట్ల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ రౌడీషీటర్‌ బరి తెగించాడు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలప్పుడు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే తన ప్రత్యర్థి అయిన మరో రౌడీషీటర్‌పై కత్తితో పాశవికంగా దాడి చేశాడు. పాత కక్షల నేపథ్యంలో విచక్షణారహితంగా పొడిచి హత్యాయత్నం చేశాడు. బాధితుడు రక్తమోడుతూ ప్రాణభయంతో పరుగులు తీయగా.. తమ కళ్ల ముందు జరిగిన రక్తపాతాన్ని చూసి జనమంతా భీతిల్లిపోయారు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌, గాంధీనగర్‌ ప్రాంతంలోని రంగారెడ్డినగర్‌కు చెందిన రోషన్‌సింగ్‌(25), జగద్గిరిగుట్ట సోమయ్యనగర్‌కు చెందిన బాలశౌరెడ్డి(23) స్నేహితులు. వీరిద్దరిపై జగద్గిరిగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో రౌడీషీట్‌లు ఉన్నాయి. రోషన్‌ సింగ్‌పై హత్యాయత్నం, కిడ్నాప్‌, అత్యాచారం, ఆయుధాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. బాలశౌరెడ్డిపై రెండు హత్య కేసులున్నాయి. అయితే, రోషన్‌ సింగ్‌, మరో ఆరుగురు యువకులు కలిసి 15 రోజుల క్రితం ఓ ట్రాన్స్‌జెండర్‌పై అత్యాచారం చేశారు. దీనిపై ట్రాన్స్‌జెండర్‌ చేసిన ఫిర్యాదుతో బాలానగర్‌ పోలీసులు కేసు నమోదు చెయ్యగా.. ఆ కేసులో రోషన్‌ జైలుకి వెళ్లివచ్చాడు. అయితే, బాలశౌరెడ్డే ట్రాన్స్‌జెండర్‌తో కేసు పెట్టించాడని రోషన్‌ కక్ష పెంచుకున్నాడు. బాలశౌరెడ్డిని చంపేస్తానని తన స్నేహితుల వద్ద సవాలు చేశాడు. ఇదే కాక, మరో అమ్మాయి విషయంలో కూడా బాలశౌరెడ్డి, రోషన్‌ మధ్య అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం మద్యం సేవించిన బాలశౌరెడ్డి, అతని స్నేహితులు ఆదిల్‌, మహ్మద్‌ కలిసి రోషన్‌ సింగ్‌ను జగద్గిరిగుట్ట లాస్ట్‌ బస్టాప్‌ వద్దకు పిలిచారు. అందరూ మాట్లాడుకుంటుండగా హఠాత్తుగా కత్తి బయటకు తీసిన బాలశౌరెడ్డి.. రోషన్‌సింగ్‌పై దాడి చేశాడు. కడుపులో కత్తితో పలుమార్లు పొడిచాడు. రోషన్‌ పారిపోకుండా మహ్మద్‌ పట్టుకున్నాడు. అనంతరం రక్తమోడుతున్న రోషన్‌ సింగ్‌ను వదిలేసి బాలశౌరెడ్డి, మహ్మద్‌, ఆదిల్‌ ద్విచక్రవాహనంపై వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రోషన్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. రోషన్‌ పరిస్థితి విషమంగా ఉంది. పాత కక్షల నేపథ్యంలోనే హత్యాయత్నం జరిగిందని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Updated Date - Nov 06 , 2025 | 02:25 AM