Share News

మద్యం మత్తులో యువకుల వీరంగం

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:41 AM

వైన్‌షాపులో వివాదం తలెత్తడంతో మద్యం మత్తులో పరస్పరం దాడులకు పాల్పడ్డారు.

మద్యం మత్తులో యువకుల వీరంగం
యువకుల దాడి

సినిమా తరహాలో ఒకరిపై ఒకరు దాడి

వైన్‌షాపు వద్ద బాహాబాహీ

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ఘటన

నేరేడుచర్ల, జూన్‌22 (ఆంధ్రజ్యోతి): వైన్‌షాపులో వివాదం తలెత్తడంతో మద్యం మత్తులో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా బయటకు వచ్చి రహదారిపై వీరంగం సృష్టించారు. వీడియోలు తీసిన కొం దరు సోషల్‌ మీడియాలో పెట్టారు. పోలీసులు వచ్చినా దాడులు ఆగలేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. సినిమా తరహాలో జరిగిన ఈ సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని రామాపురం రోడ్డులోని వైన్‌షాపు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రామాపురం రోడ్డులో పెంచికల్‌దిన్న గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, నేరేడుచర్లకు చెందిన నలుగురు యువకులు పక్కపక్క టేబుళ్లలోనే కూ ర్చుని మద్యం తాగుతున్నారు. నేరేడుచర్లకు చెందిన ఓ యువకుడు వైన్స్‌ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనానికి తగలడంతో వాహనం కింద పడింది. గమనించిన పెంచికల్‌దిన్నకు చెందిన యువకుడు అతనిపై దాడి చేసి గాయపర్చడంతో ఇరువర్గాల మధ్య గొడవ ప్రారంభ మైంది. పెంచికల్‌దిన్న యువకులు అక్కడున్న నలుగురిపై దాడి చేశారు. నేరేడుచర్లకు చెందిన నలుగురు యువకులు స్నేహితులకు సెల్‌ద్వారా సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న స్నేహితులు పెంచికల్‌దిన్న యువకులపై దాడి చేశారు. రామాపురం రోడ్డులో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో అర్థం కాలేదు. ఇరువర్గాలు కొట్టుకుంటుండగా జనం భారీగా పోగయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా వారిని ఎవరూ ఆపలేక పోయారు. గరిడే పల్లి నుంచి అదనంగా పోలీసులు వచ్చి గొడవను అడ్డుకున్నారు. అప్పటికే ఇరువర్గాల వారికి గా యాలయ్యాయి. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయని, విచారణ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు.

Updated Date - Jun 23 , 2025 | 12:41 AM