Young Man Nominates Girlfriend for Sarpanch Post: ప్రెసిడెంట్ గారి భర్తనైనా అవుదామని!
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:08 AM
తమ గ్రామానికి సర్పంచ్ అవ్వాలని అనుకున్న ఓ యువకుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ఆ ఎన్నికలు వచ్చేసినా...
ప్రియురాలితో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించిన
యువకుడు.. ఆ వెంటనే ఆమెతో పెళ్లి
సంగారెడ్డి రూరల్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): తమ గ్రామానికి సర్పంచ్ అవ్వాలని అనుకున్న ఓ యువకుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ఆ ఎన్నికలు వచ్చేసినా.. రిజర్వేషన్ అనుకూలించక పోటీ చేసే అవకాశం కోల్పోయాడు. కానీ, నిరుత్సాహపడని ఆ యువకుడు ప్రెసిడెంట్‌ని కాకపోతేనేం.. ప్రెసిడెంట్ గారి భర్తనైనా అవుదామనే ఆలోచనతో తన ప్రేయసితో నామినేషన్ వేయించేశాడు. ఆపై, క్షణం కూడా ఆగకుండా ఆ యువతిని పెళ్లి చేసేసుకున్నాడు. సంగారెడ్డి మండలం తాళ్లపల్లికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా.. ఆ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. దీంతో చంద్రశేఖర్ తన ప్రియురాలు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీజతో నామినేషన్ వేయించాడు. అనంతరం శ్రీజను పెళ్లి చేసుకున్న చంద్రశేఖర్ గౌడ్.. తమకు రక్షణ కల్పించాలంటూ సంగారెడ్డి రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. మరోపక్క, తమ కుమార్తె కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి పోలీసుస్టేషన్‌కు వెళ్లిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్... చంద్రశేఖర్ గౌడ్, శ్రీజలకు మద్దతుగా నిలిచారు. కాగా, అప్పటిదాకా ఏకగ్రీవం అనుకున్న తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి శ్రీజ నామినేషన్‌తో ఎన్నిక అనివార్యమైంది.