Share News

Young Man Commits Suicide: ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:32 AM

తాను ప్రేమించిన యువతికి ఆమె కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి, లండన్‌ నుంచి వచ్చిన ఆ యువకుడు.. తన ప్రేయసిని ఆమె తరఫువారు మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య ...

Young Man Commits Suicide: ప్రేమ విఫలమైందని యువకుడి ఆత్మహత్య

  • యువతితో ఐదేళ్లుగా ప్రేమలో.. ఆమెకు పెళ్లి సంబంధాలు

  • దీంతో లండన్‌ నుంచి వచ్చిన యువకుడు

  • ఆమె మరొకరిని పెళ్లాడంతో బలవన్మరణం

  • పోలీసు వాహనంపై మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యుల నిరసన

  • నిజామాబాద్‌ జిల్లా దోంచందలో విషాదం

ఏర్గట్ల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తాను ప్రేమించిన యువతికి ఆమె కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి, లండన్‌ నుంచి వచ్చిన ఆ యువకుడు.. తన ప్రేయసిని ఆమె తరఫువారు మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్‌ రెడ్డి (29) ఆరేళ్లుగా లండన్‌లో చదువుకుంటూ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. తమ గ్రామానికి చెందిన ఓ యువతితో అతడు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. తమ ఇంట్లోవాళ్లు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ శ్రీకాంత్‌కు యువతి ఫోన్‌ చేసి చెప్పడంతో 8నెలల క్రితం అతడు లండన్‌ నుంచి సొంతూరుకు వచ్చాడు. అయితే యువతిని శ్రీకాంత్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె తరఫువారు నిరాకరించారు. మరో వ్యక్తితో ఆమె పెళ్లి జరిపించారు. ఈ పరిణామంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీకాంత్‌ 20 రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. ప్రేమించిన అమ్మాయే తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిందని, అందుకే తాను పురుగుల మందు తాగినట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్‌ గురువారం మృతిచెందాడు. ఘటనపై ఫిర్యాదు చేసినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ మృతుడి తరఫువారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతో పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తాళ్లరాంపూర్‌ శివారులో వాహనాలు పెట్టి అడ్డుకున్నారు. అయితే బాధితులు, మృతదేహంతో ఉన్న ఫ్రీజర్‌ను పోలీసుల వాహనంపై పెట్టి.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాలినడకన మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఘటనా స్థలానికి భీమ్‌గల్‌ సీఐ సత్యనారాయణతో పాటు భీమ్‌గల్‌ పరిధిలోని ఎస్సైలు చేరుకొని బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ రెడ్డి రంగంలోకి దిగి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు నిరసన విరమించారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పోలీసులు దోంచంద గ్రామంలో మోహరించారు.

Updated Date - Nov 29 , 2025 | 03:32 AM