Share News

Yoga Guru Blackmailed by Women: యోగా గురువుపై వలపు వల

ABN , Publish Date - Sep 15 , 2025 | 05:03 AM

ఆయనో యోగా గురువు.. హైదరాబాద్‌ శివార్లలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.. ఆరోగ్యం బాగోలేదంటూ ఆశ్రమానికి వచ్చిన ఇద్దరు మహిళలు...

Yoga Guru Blackmailed by Women: యోగా గురువుపై వలపు వల

  • అనారోగ్యం అంటూ వచ్చి ఆశ్రమంలో చేరి, గురువుకు దగ్గరై.. ఫొటోలు, వీడియోలు తీసిన ఇద్దరు మహిళలు

  • 2 కోట్లు ఇవ్వాలని, లేకుంటే అవి బయటపెడతామని బెదిరింపులు

  • పోలీసులను ఆశ్రయించిన గురువు డబ్బులిస్తామని పిలిపించి ముఠాను పట్టుకున్న పోలీసులు

చేవెళ్ల/హైదరాబాద్‌ సిటీ/కార్వాన్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆయనో యోగా గురువు.. హైదరాబాద్‌ శివార్లలో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.. ఆరోగ్యం బాగోలేదంటూ ఆశ్రమానికి వచ్చిన ఇద్దరు మహిళలు ఆయనకు వలపు వల విసిరారు.. సన్నిహితంగా ఉన్నట్టు నటించి ఫొటోలు, వీడియోలు తీశారు.. వాటిని తమ ముఠా సభ్యులకు పంపి యోగా గురువును బ్లాక్‌మెయిల్‌ చేశారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మిట్ట వెంకటరంగారెడ్డి రెండేళ్లుగా చేవెళ్ల మండలం దామరగిద్ద గ్రామంలో ‘సీక్రెట్‌ ఆఫ్‌ నేచర్స్‌’ పేరిట యోగా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నెలలో 10 రోజుల పాటు ఆహార అలవాట్లు, ఆరోగ్యం, యోగాపై శిక్షణ ఇస్తారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన అమర్‌ అనే వ్యక్తి.. వెంకటరంగారెడ్డి నుంచి సొమ్ము లాగాలని ప్రణాళిక వేశాడు. మంజుల, రజని అనే ఇద్దరు మహిళలతో యోగా గురువు వద్దకు వెళ్లారు. వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని,యోగాతో సాంత్వ న కల్పించాలని కోరి ఆశ్రమంలో చేర్పించాడు. ఆ ఇద్దరు మహిళలు ప్లాన్‌ ప్రకారం.. యోగా గురువుకు దగ్గరై, క్రమంగా సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు. ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని అమర్‌కు పంపించారు. అమర్‌ ముఠా.. ఈ ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని యోగా గురువుపై బ్లాక్‌మెయిల్‌కు దిగారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే.. వాటిని బయటపెట్టి పరువు తీస్తామని, ఆశ్రమానికి చెడ్డపేరు వస్తుందని బెదిరించారు. దీనిపై ఆందోళన చెందిన యోగా గురువు.. రూ.50 లక్షలు చెక్కుల రూపంలో ఇచ్చారు. అది సరిపోదని, రూ.2 కోట్లు ఇవ్వాలని అమర్‌ ముఠా మళ్లీ బ్లాక్‌ మెయిలింగ్‌ మొదలుపెట్టింది. దీనితో ఆయన పోలీసులను ఆశ్రయించగా.. వారు డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. డబ్బులు ఇస్తానని, హైదరాబాద్‌ శివార్లలోని తారామతి బారాదరి వద్దకు రావాలని అమర్‌ ముఠాకు యోగా గురువుతో ఫోన్‌ చేయించారు. ముఠా సభ్యులు అమర్‌, మంజుల, రజని, మౌలాలి, రాజేశ్‌ తారామతి బారాదరి వద్దకు వచ్చి యోగా గురువును బెదిరిస్తుండగా.. పక్కనే మాటువేసిన గోల్కొండ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ముఠా గతంలో ఏవైనా నేరాలకు పాల్పడిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 15 , 2025 | 05:03 AM