యాదగిరి క్షేత్రం.. కోలాహలం
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:06 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం సోమవారం భక్తులతో కోలాహలంగా మారింది. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్ట, జూన్ 2(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం సోమవారం భక్తులతో కోలాహలంగా మారింది. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపైన బస్టాండ్ ప్రాంగణంలో వాహనాలు పార్కింగ్ చేయగా రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ప్రధానాలయం, శివాలయం, కల్యాణ మండపం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, ప్రసాద విక్రయశాలల్లో సందడి నెలకొంది. సుమారు 36 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక, ఉచిత ధర్మ దర్శన క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు ఉదయం నుంచి రాత్రి వరకు సందడిగా మారాయి. ప్రత్యేక దర్శనాలకు గంటన్నర, దర్మధర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలపారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 43,72,183 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్. వెంకట్రావ్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండపైన ప్రొటోకాల్ కార్యాలయం ఎదురుగా దేవాదాయ కమిషనర్, ఆలయ ఈవో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉదయం పండితుల వేద మంత్ర పఠనాలతో ప్రత్యేక పూజలు చేసి 8.30 గంటలకు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు జూశెట్టి క్రిష్ణ, గజ్వేల్లి రమేష్‌బాబు, పర్యవేక్షకుడు మాచర్ల రాజన్‌బాబు పాల్గొన్నారు.
శివకేశవులకు విశేష పూజలు
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి కొండపై హరిహరులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభు స్వామిఅమ్మవారికి వైష్ణవ పాంచరాత్రాగమరీతిలో, పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి శివాలయంలో స్ఫటికమూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామిఅమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు మూలమూర్తులను వేదమంత్ర పఠనాలు, పంచామృతాలతో అభిషేకించి, తులసీ దళాలతో అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన పూజారులు విశ్వక్సేనుడికి తొలి పూజలు చేపట్టి సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం నిర్వహించారు. సాంయంత్రం వేళ అలంకార వెండి జోడు సేవలు, సహాస్రనామార్చనలు ఆగమశాస్త్రరీతిలో కొనసాగాయి. శివాలయంలోని ముఖమండపంలో స్ఫటికమూర్తును అర్చకులు వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య పంచామృతాలతో అభిషేకించారు. శివపార్వతుల ఉత్సమూర్తులకు పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు.